ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి ‘సిలారు సాయబు’ episode artwork

EPISODE · Nov 1, 2020 · 24 MIN

ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి ‘సిలారు సాయబు’

from Harshaneeyam

హర్షణీయంలో ఇప్పుడు మీరు వినబోతున్న కథ, సుప్రసిద్ధ సాహితీవేత్త, ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి ‘సిలారు సాయబు’. ఇది వారి ‘గుడి’ అనే కథాసంకలనం నుంచి స్వీకరించబడింది.తెలుగు సాహిత్యంలో వున్న అన్ని సాహితీ ప్రక్రియలలో విశేష కృషి సలిపిన ఆచార్య కొలకలూరి ఇనాక్, గత ఆరు దశాబ్దాలు గా తెలుగు భాషని తన రచనలతో సుసంపన్నం చేస్తున్నారు. ఆయన సాహితీసేవకు గుర్తింపునిస్తూ, జ్ఞానపీఠ్ సంస్థ, ప్రతిష్టాత్మకమైన ‘మూర్తిదేవి’ అవార్డుతో, కేంద్రప్రభుత్వం వారు ‘పద్మశ్రీ’ పురస్కారం తో ఆయనను సత్కరించడం జరిగింది. తమ రచనను హర్షణీయం ద్వారా మీకందించడానికి అనుమతినిచ్చినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.డిసెంబర్ నెలలో వారి ఇంటర్వ్యూ ‘హర్షణీయం’ ద్వారా మీకందించబడుతుంది. ‘గుడి’ కథాసంపుటి ని కొనేటందుకు కావలసిన వివరాలు ఇదే వెబ్ పేజీలో ఇవ్వబడ్డాయి.‘సిలారు సాయబు’:నాగడు సిలారు సాయిబును కొట్టాడు. సిలారు నవ్వాడు. నాగడికి ఏడుపు వచ్చింది. మళ్ళీ కొట్టాడు. సిలారు ఇంకా నవ్వాడు.వాడు కొట్టా . వీడు నవ్వా. ఇదే తంతు. వాడు బలవంతుడు. వీడు బల హీనుడు. వాడున్నవాడు. వీడు లేనివాడు. వాడు సంసారి. వీడు బికారి.నాగడికి తిక్క ముదిరింది. కర్రతో బాదాడు.'నన్ను తిట్టరా' అన్నాడు. సిలారు తిట్టలేదు. 'నన్నుకొట్టరా' అన్నాడు. సిలారు కొట్టలేదు. 'నన్ను వాటేసుకోరా' అన్నాడు. సిలారు వాటేసుకోలేదు.సిలారుసాయిబు తనను తిట్టాలని, కొట్టాలని, వాటేసుకోవాలని నాగడికి ఆశ, ఇష్టం, ఉబలాటం, ఆరాటం. అందుకే ఈ చావు.నాగడు తనకు వచ్చిన బూతులన్నీ తిట్టాడు. సిలారు నవ్వుతాడు కానీ తిట్టడు.సిలారుకు ఒక ప్రఖ్యాతి ఉంది. వీడు తిట్టినా కొట్టినా తాకినా మేలు జరుగు తుందని.అతడి ఊరూ పేరూ ఎవరికీ తెలియదు. ఎప్పుడో ఎవరితోనో సిలారుసాయిబు అని తన పేరు చెప్పాడని అందరూ అనుకొంటారు. అలా అతడికి ఆ పేరు స్థిర పడింది. ఆ పేరుతో పిలిస్తే తిరిగి చూస్తాడు కానీ 'ఏమీ?' అని అడగడు.మర్రిచెట్టు కింద పడుకొంటాడు. దేవుళ్ళ చెరువులో బుద్ది పుట్టినంత సేపుమునుగుతూ తేలుతూ ఉంటాడు. బర్రెలు, దున్నలు, పెయ్యలు, దూడలు నీళ్ళలో మునిగినట్లే సిలారు సాయిబూ మునుగుతూ తేలుతూ ఉంటాడు.  బరి గొడ్డు గట్టెక్కగానే తానూ ఒడ్డు కెక్కి వేప చెట్టు కింద కూర్చుంటాడు. బట్టలు ఒంటి మీదే ఆరి పోతాయి. ఎవర్నీ ఏమీ పెట్టమని అడగడు. ఏం పెట్టినా తీసుకోడు. ఇష్టమైంది ఎక్కడున్నా తీసుకుంటాడు. చలిలేదు, వానలేదు, ఎండలేదు. మర్రి చెట్టు కిందే మకాం. పగల్లేదు, రాత్రిలేదు, ఎప్పుడయినా నిద్రపోతాడు, నిద్రపో యినప్పుడు తప్ప చెట్టు కింద ఉండడు. ఎవరైనా చిరుగులబొంత ఇచ్చినా కప్పు కోడు. పక్కనేసుకోడు. బుద్ధి పుడితే దాని మీద పడుకొంటాడు. లేకపోతే అది అక్కడ ఉండగానే గడ్డి మీద పడి నిద్రపోతాడు. వాడికి దినచర్య లేదు. ఇప్పుడు నిద్రపోవాలని గానీ ఇప్పుడు నిద్ర లేవాలనిగాని నియమమేమీ లేదు.సిలారు సాయిబుకు ఏం తొందరో అంగలు పంగలు వేసుకుంటూ వస్తాడు. గబగబా పోతాడు. పరుగూ కాదు. నడకా కాదు. అడ్డదిడ్డంగా పడుతూ లేస్తూ వస్తూ పోతూ ఉంటాడు. మాదిగ పల్లెను వదిలి ఎక్కడికీ పోడు. పల్లె పెద్ద ఎక్క డిదో పాత నిక్కరుంటే సిలారు సాయిబును పట్టుకొని తొడిగాడు. అది జారి పోకుండా మోకులాంటి మొలతాడు కట్టాడు. మొలతాడు అదుపాజ్ఞల్లో నిక్కరు ఖైదు అయింది. నెలకో ఆర్నెల్లకో పల్లె పెద్దకు బుద్ధిపుడితే పై బట్టలు పీకేసి ఉతికి నవేవో తొడుగుతాడు. పల్లెమొత్తం మీద పెద్ద మాదిగకు మాత్రమే సిలారు సాయిబు దొరికేవాడు. ఏ బట్ట పీకి పారేసినా ఓర్చుకునేవాడు. ఏ ఉతికిన బట్టలు వేసినా ఒప్పుకొనేవాడు. ఇక పల్లెలో ఎవరి చేతికి దొరకడు. ఏం పనీ ఉండదు. పల్లె వీధు లన్నీ మళ్ళీ మళ్ళీ తిరుగుతుంటాడు. ఎవురైనా ఎదురైతే అల్లంత దూరంగా తప్పు కొని తప్పించుకొని పోతాడు. ఎవరైనా వీధిలో కూర్చుని అన్నం తింటుంటే తినే గిన్నెలో నుంచి గుప్పెడు మెతుకులు లాక్కొని తింటాడు. అంతా నోట్లోకి పోని వ్వడు. రెండు మెతుకులటు రెండిటు పడేసుకుంటూ బొక్కుతాడు.చెరువులో నీళ్ళయినా తాగుతాడు. కుడితి తొట్లెలో నీళ్ళయినా తాగుతాడు. చెంబట్టుకు పోయేవాళ్ళ చెంబు తీసుకోనైనా తాగుతాడు. బావి దగ్గరకు పోడు. నీళ్ళు దోసిట్లో పోయించుకోడు.ముంత లేదు. మూకుడు లేదు. కుండలేదు. సట్టిలేదు. వాడికి కూడు వండుకునే పనిలేదు. పొలాలో అడ్డం పడిపోతుంటాడు. చేతికందినవి తింటాడు. అవి కాకరకాయ లైనా చింతలేదు. చింతకాయలైనా తొందరలేదు. దోసకాయలైనా ఇబ్బందిలేదు. రాంములక్కాయలైనా ఫరవాలేదు. పొలంలో పండే ఏ కూరగాయనూ ఆకు కూర నూ వద్దనకుండా తింటాడు. పచ్చిగడ్డి కూడా పరమాన్నంలా భుజిస్తాడు...సిలారు సాయిబు మాదిగపల్లెలో వింతజీవి. అతడు తుమ్మినట్లు కానీ, దగ్గి నట్లు కానీ, జ్వరం వచ్చిందని కానీ, లేవలేకుండా ఉన్నాడని కానీ ఎవరూ ఎప్పుడూ చెప్పుకోలేదు.'నా చిన్నతనం నుంచి సిలారు సాయిబు ఇట్లానే ఉన్నాడ'ని ముసలివాళ్ళు కూడా చెప్పుకుంటూ ఉంటారు.అతను ఏం తిన్నా ఎవరూ ఏమీ అనరు. ఏం తాగినా తాగిస్తారు. వాడు తాము భరించవలసిన ఒక ప్రాణి అని మానవమాత్రుడని పల్లెవాళ్ళు గుర్తించారు.ఏ నియమం, ఏ హద్దు, ఏ అడ్డు, ఏ ప్రతిబంధకం లేకుండా సిలారు సాయిబు మాదిగపల్లెలో స్వేచ్ఛాజీవిగా ఉన్నాడు.ఏ పంట బాగా పండినా సిలారు సాయిబే కారణమనుకోసాగారు. ఒకరింట్లో చొరబడి గుప్పెడు కందులు తీసుకొని తింటూ వెళ్ళిపోయాడని, ఆ సంవత్సరం ఆ ఇంటికి కందిపంట ఇబ్బడి ముబ్బడిగా వచ్చిందని వాళ్ళ ఆనందం. ఆ సంతో షంతో వాళ్ళు కందిపప్పు వండి, ముద్దపప్పు మధ్య గుంట చేసి గుంట నిండా నేయి పోసి, తీసుకొనిపోయి ఇస్తే ముఖంలోకి చూచి ఇకిలించి, చేత్తో విస్తరిని విసిరి కొట్టాడని చెప్పుకుంటుంటారు. ముద్దపప్పు నేల పాలయినందుకు తెచ్చిన మనిషే చింతపడలేదు. సిలారు సాయిబు ఇకిలించటం మానలేదు.రామికి పెళ్లి కాలేదు. పిల్ల ముదిరిపోయిందని తల్లి, తండ్రీ, పల్లె గగ్గోలు పెడుతుంటే కుమిలిపోతూ ఏడుస్తూ ఇంటి మట్టి గోడకానుకొని, చూరుకింద కూర్చుని, బియ్యంలో మట్టిబెడ్డలు ఏరి తింటూ కనిపించేది. పిల్ల తల్లిదండ్రులు పెద్ద ఆస్తిపరులేం కాదుగాని తినడానికి ఉన్నవాళ్ళే. పిల్ల కురూపా అంటే అదేం కాదు. చూడముచ్చటగానే ఉంటుంది. పన్నెండు ఏళ్ళ వయస్సు రాగానే పెద్ద పిల్లయి కూర్చుంది.తండ్రి పెండ్లి సంబంధాల కోసం తిరిగిన ఊరు తిరగకుండా పదూళ్ళు తిరి గాడు. రెండు జతల చెప్పులు మార్చాడు. పెళ్ళి కుదరలేదు.పిల్ల ముదిరిపోతూ ఉందని అందరూ గోల చేస్తున్నారు. ఈ ఊర్లో రెండో పెళ్ళివాడో, పోనీ పెళ్ళామున్నవాడో నేనున్నానంటూ పిల్ల కన్నెచెర తొలగిస్తానంటూ ముందుకు రాలేదు. పిల్ల పెళ్ళి అవసరం కంటే పల్లెకు ఆ పిల్లను వదిలించుకోవలసిన అవసరం ఎక్కువైనట్లుగా వుంది.  గోలంతా చూస్తే ప్రతి భార్యా, భర్తను కట్టుబాట్ల మధ్య కట్టేసుకోలేక నానా తిప్పలు పడుతూ ఉందనిపిస్తుంది.ఈ ఆడవాళ్ళ సూటిపోటి మాటలతో పిల్ల మరింత ముడుసుకుపోతూ ఉంది. కుమిలి పోతూ ఉంది. కుంగిపోతూ ఉంది. బావిలో నీళ్ళన్నీ కళ్ళలో ఉన్నట్లే కన్నీరు కారుస్తూ ఉంది.ఒకరోజు అటుపోతున్న సిలారు సాయిబు పిల్ల భుజం మీద ఉన్న ఓణీ లాక్కొని, తెలి మీద మొట్టికాయ కొట్టి, ఓణీని జెండాలా ఎగరేస్తూ పోతూ ఉండటం పల్లెంతా చూచింది. ఎదురొమ్ములకు చాట అడ్డం పెట్టుకొని పిల్ల ఇంట్లోకి దూరింది. సిలారు సాయిబు పిల్ల ఓణీ జెండా చేసుకున్నాడన్న వార్త గాలికంటే వేగంగా ప్రయాణం చేసింది.వారం రోజుల్లో రెండు సంబంధాలు వచ్చాయి. అమ్మాయి ఆనందానికి తిరుగు లేదు.ఎవరైనా సరే' అంది. అంతే. పదిరోజుల్లో పెళ్ళయింది. ఏడాదికి కొడుకునె త్తుకుంది. సిలారు సాయిబుకు చూపిస్తే వాడేలోకాన వాడున్నాడు. చూళ్ళేదు. తిట్ట లేదు. కొట్టలేదు. 'సిలారు సాయిబు సలవ' అన్నారు ఆడవాళ్ళు. 'దేవుడి దయ' అన్నారు మగవాళ్ళు. 'ఈడేరిన పిల్ల. పెళ్ళయింది. పెళ్ళయితే పిల్లలు పుట్టరా. పుట్టేరు. అంతే. కిందోడి సలవా లేదు, పైవాడి దయా లేదు' అన్నారు పంతులుగారు.పంతులుగారు అంటే బాపనాయన కాదు. మాదిగాయనే. పల్లె బళ్ళో పంతులు. పంతులు చెప్పే అఆఇఈలు ఎవరైనా వింటారు. ఒప్పుకొంటారు.పిల్లలు చదువుకొంటారు. కానీ సిలారు సాయిబు చలవ లేదన్నా, దేవుడి దయ కాదన్నా పల్లెవాళ్ళు ఒప్పుకోరు.కారణం లేనిదే కార్యం జరగదంటాడు పంతులు. మాదిగపల్లెలో కార్యం అంటే పెళ్ళయిన ఆడపిల్లని, మగపిల్లాణ్ణి ఒక మంచం మీద పడుకోబెట్టి తలుపేయటం.'పెళ్ళి చేయటం కారణం. ఈ కారణం లేనిదే ఆ కార్యం లేదు' అంటాడు పంతులు.పెడసరపువాడు ఒకడు 'పెళ్ళే ఒక కార్యం ' అంటే పంతులు నవ్వి 'ఒక మగ పిల్లవాడు, ఒక ఆడపిల్ల పుట్టి ఉండడం కారణం' అన్నాడు.''వాళ్ళు పుట్టడమే ఒక కార్యం' అన్నాడు పెడసరపువాడు.'వాళ్ళ అమ్మా నాన్నలకు పెళ్ళి కావడమే కారణం' అన్నాడు పంతులు. 'ఒక కారణం లేందే ఒక కార్యం జరగదు' అన్నాడు. ఒప్పుకొన్నారు కానీ కొన్ని సార్లు ఒకటే కార్యమూ, కారణమూ కావటం విచిత్రంగా ఉంది. ఏమైనా జరగవని సిందేదో జరుగుతుంది అనుకొన్నారు మెట్ట వేదాంతవేత్తలు. -సుబ్బడు మూడేళ్ళుగా ఎస్సెస్సెల్సీ తప్పుతున్నాడు. నాలుగో ఏడు కూడా తప్పితే ఇక వాడికి ఎస్సెస్సెల్సీ పాసయ్యే యోగ్యత ఉండదు. కాలేజీలో చేరే రాత ఉండదు.'ఎందువల్ల? 'ఉట్టి కెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కలేదు' 'ఐదోసారి ఉట్టిమీదికి ఎందుకు ఎక్కనీయకూడదు' 'ఉట్టి తెగుద్ది'పంతులుగారితో పెడసరపోడు మాట్లాడుతున్నపుడు సుబ్బడు సజ్జబువ్వలో పెరుగు కలుపుకొని మల్ల వళ్ళో పెట్టుకొని, నడిమంచం మీద కూర్చున్నాడు. మంచం నులక వదులై ముడ్డి నేల కానింది. సుబ్బడు వంచిన తల ఎత్తకుండా జుర్రుకొంటున్నాడు. అందుకు కారణాలు రెండు. ఒకటి రైలుకి సిగ్నలు ఇచ్చారు. రెండు రైలెక్కి గుంటూరు పోయి ఎస్ఎల్సీ నాలుగోసారి పరీక్ష రాయాలి....

Episode metadata supplied by the publisher feed · Published Nov 1, 2020

Embed this episode

Ready to play

ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి ‘సిలారు సాయబు’

0:00 24:19

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Harshaneeyam?

This episode is 24 minutes long.

When was this Harshaneeyam episode published?

This episode was published on November 1, 2020.

Can I download this Harshaneeyam episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!