EPISODE · Jun 17, 2023 · 3 MIN
55. విష, అమృత వలయాలు
from Gita Acharan · host Siva Prasad
విష, అమృత వలయాలు ఒక సంఘటన నుంచి మరొకదానికి దారితీసే సంఘటనల శ్రేణి; ఇవి దుఃఖాన్ని లేదా సుఖాన్ని కలిగిస్తాయి. ఖర్చులు ఆదాయం కంటే ఎక్కువగా ఉంటే ఋణాలు, అప్పుల ఉచ్చుకు దారి తీస్తే అది ఒక విషవలయం. ఆదాయం కంటే ఖర్చులు తక్కువగా ఉండి సంపద సృష్టి జరిగితే అది ఒక అమృత వలయం. శ్రీకృష్ణుడు ఈ వలయాలను గురించి 2.62 నుండి 2.64 శ్లోకాలలో పేర్కొన్నారు. “విషయచింతన చేయు పురుషునకు ఆ విషయముల యందు ఆసక్తి ఏర్పడును. ఆసక్తివలన ఆ విషయములను పొందుటకై కోరికలు కలుగును. ఆ కోరికలు తీరనప్పుడు క్రోధము ఏర్పడును. అట్టి క్రోధమువలన వ్యామోహము కలుగును. దాని ప్రభావమున స్మృతి ఛిన్నాభిన్నమగును. స్మృతిభ్రష్టమైనందున బుద్ధి అనగా జ్ఞానశక్తి నశించును. బుద్ధినాశమువలన మనుష్యుడు తన స్థితినుండి పతనమగును” అని శ్రీకృష్ణుడు చెప్పారు (2.62-2.63). ఇది పతనానికి సంబంధించిన విష వలయం. “అంతఃకరణమును వశమునందుంచుకొనిన సాధకుడు రాగద్వేషరహితుడై, ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించుచున్నను మనశ్శాంతిని పొందును ” అని శ్రీకృష్ణుడు అంటారు (2.64). ఇది శాంతి, ఆనందం యొక్క అమృత వలయం తప్ప మరొకటి కాదు. మనమందరం దైనందిన జీవితంలో ఆకర్షణీయమైన లేక అసహ్యమైన ఇంద్రియ వస్తువుల మధ్య సంచరిస్తూ ఉంటాము. అటువంటి ఇంద్రియ వస్తువులతో మనం ఎలా వ్యవహరిస్తామనేది మన ప్రయాణ దిశను నిర్దేశిస్తుంది. ఒక అమృత వలయం విషయంలో ఒకరు ఇంద్రియ వస్తువుల ఆకర్షణ, వికర్షణ నుంచి విముక్తి పొందుతారు. అయితే ఒక విష వలయంలో ఇంద్రియ వస్తువుల ఆకర్షణకు లోనవుతారు లేక అసహ్యాన్ని పెంచుకుంటారు. విషవలయం నుంచి అమృత వలయానికి రావడానికి సులభమైన మంత్రం 'ద్వేషాన్ని వదిలివేయడం'. ఎందుకంటే, ఈ ద్వేషం మనకు హాని కలిగించే విషం లాంటిది (5.3). ద్వేషాన్ని వదిలినప్పుడు, దాని ధృవ వ్యతిరేకమైన రాగం కూడా తొలగిపోతుంది. ఫలితంగా ఒక పుష్పం అందం, సువాసనను వ్యాప్తి చేసినట్లుగా షరతులు లేని ప్రేమకు దారి తీస్తుంది. రాగద్వేషాలను దాటి ముందుకు పోవడం అనేది భగవద్గీతలో ఒక మౌలిక ఉపదేశం. శ్రీకృష్ణుడు అన్ని జీవులలో మనల్ని, అన్ని జీవులను మనలో చివరకు కృష్ణుడిని ప్రతిచోటా చూడమని సలహా ఇస్తారు (6.29). ఈ ఏకత్వం మనకు ద్వేషాన్ని వదిలివేయడంలో సహాయపడుతుంది; చివరికి మనల్ని ఆనందపరుస్తుంది.
Embed this episode
NOW PLAYING
55. విష, అమృత వలయాలు
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.