EPISODE · Sep 24, 2023 · 3 MIN
66. సమర్పణ లేదా సంఘర్షణ
from Gita Acharan · host Siva Prasad
జీవించడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి 'సంఘర్షణ', మరొకటి 'సమర్పణ'. సమర్పణ అనేది యుద్ధంలో ఓడిపోయిన వారి లొంగుబాటు వంటి నిస్సహాయత కాదు. ఇది అవగాహనతో, క్రియాశీలమైన అంగీకారంతో సమర్పించుకోవడం. ఇతరులను దాటిపోవాలనుకునే కోరిక; భగవంతుడు మనకిచ్చిన దానికంటే అధికంగా పొందాలనుకోవడం; మన దగ్గర ఉన్నదానికంటే భిన్నమైన దాన్ని కలిగి ఉండాలనుకోవడమే సంఘర్షణ. మరోవైపు, సమర్పణ ప్రతి సజీవ క్షణానికి కృతజ్ఞత. “ఎవరైతే ఇంద్రియాల ద్వారా భోగాలలో రమించి, సృష్టిచక్రాన్ని అనుసరించి చరించరో అతని జీవితం వ్యర్ధం” అని శ్రీకృష్ణుడు ఉద్ఘాటించారు (3.16). ఈ ఇంద్రియాలను సంతృప్తిపరిచే మార్గంలో పయనించే ఎవరికైనా జీవితము సంఘర్షణ మయము. ఎందుకంటే అవి ఎప్పటికీ సంతృప్తి చెందవు. ఇది పోరాటం, ఉద్రిక్తత, ఆందోళన మరియు కష్టాలను తెచ్చే వ్యర్ధ జీవితం. శ్రీకృష్ణుడు వర్షం యొక్క ఉదాహరణను ఉపయోగించి సృష్టిచక్రాన్ని వివరిస్తారు (3.14). 'వర్షం' నీటి యొక్క నిస్వార్ధ కర్మ రూపం; ఇందులో నీరు ఆవిరైపోతుంది; నిస్వార్ధంగా వర్షం రూపంలో కురుస్తుంది. అటువంటి నిస్వార్ధ కర్మలే సర్వోన్నత శక్తికి మూలం (3.15). నిస్వార్ధ కర్మల చక్రాన్ని అనుసరించడమే సమర్పణాయుత జీవితం; ఇది మనల్ని ఆనందమయం చేస్తుంది. “స్వయం తో ఆనందించే వ్యక్తి ఆత్మ లోనే తృప్తి చెందుతాడు; ఆత్మలోనే ఆనందం పొందుతాడు; అతనికి ఎటువంటి కర్తవ్యం ఉండదు” అని శ్రీకృష్ణుడు చెప్పారు (3.17). ఇది ఇంద్రియాల నుండి స్వతంత్రమైన జీవితం, ఇక్కడ ఒక వ్యక్తికి అస్తిత్వము కంటే వేరే కోరికలు ఉండవు. అస్తిత్వం యొక్క కోరికే మన కోరిక అయినప్పుడు మనకు వేరే కర్తవ్యం ఏమీ ఉండదు. అంటే నిస్వార్ధ కర్మలను చేస్తూ మనకు ఇవ్వబడిన ప్రతిదానిని మనస్ఫూర్తిగా అంగీకరించడం. “అట్టి మహాత్ముడు ఈ జగత్తునందు కర్మలు చేయుట వలనను, చేయకుండుట వలనను అతనికి ఎట్టి ప్రయోజనమూ ఉండదు. అతనికి సర్వప్రాణుల తోడను స్వార్థపరమైన సంబంధము ఏవిధముగను ఏమాత్రము ఉండదు” అని శ్రీకృష్ణుడు చెబుతున్నారు (3.18). 'స్వయంతో సంతృప్తి' అనేది భగవద్గీతలో ఒక మౌలిక ఉపదేశం. ఇది స్వయంతో ఆనందంగా ఉండడం, ఆత్మ సంతృప్తిని కలిగి ఉండడం. ఒక వ్యక్తి స్వయంతో సంతృప్తి చెందితే మన అర్హతలు, సామర్ధ్యాల గురించి ఎటువంటి ఫిర్యాదులు లేదా పోటీలు ఉండవు.
Embed this episode
NOW PLAYING
66. సమర్పణ లేదా సంఘర్షణ
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.