EPISODE · Nov 30, 2023 · 3 MIN
72. అపోహల ఖైదీ
from Gita Acharan · host Siva Prasad
“ప్రకృతిగుణములచే పూర్తిగా మోహితులైన మనుష్యులు ఆ గుణముల యందును, కర్మలయందును మిక్కిలి ఆసక్తులగుదురు. అట్టి మిడిమిడి జ్ఞానముగల మందబుద్ధులైన అజ్ఞానులను పూర్తిగా తెలిసిన జ్ఞానియైనవాడు భ్రమకు (ఊగిసలాటకు) గురి చేయరాదు” అని శ్రీకృష్ణుడు చెప్పారు (3.29). మన కర్మలకు అసలైన కర్త అవడమే కాకుండా సత్త్వ, రజో, తమో గుణాలకు మన నిజమైన స్వభావాన్ని మరచిపోయేలా చేసి మనను మంత్రముగ్ధులను చేయగల సామర్థ్యం ఉంది. మనం వీటి మాయ యొక్క అధీనంలో ఉన్నామని గ్రహించే వరకు మనం మంత్రముగ్ధులమై ఉంటాము. శ్రీకృష్ణుడు అజ్ఞానులు, జ్ఞానుల గురించి చెబుతారు. అజ్ఞానులు గుణాల యొక్క మంత్రముగ్ధతలో ఉండి తాము కర్తలమని భావిస్తారు; ఏదో సాధించాలని, గొప్ప వారిగా ఉండాలని, సమాజంలో గుర్తించ బడాలని, అధికారం కావాలని కోరుకుంటారు (3.27). అదే సమయంలో వారు కుటుంబం, కార్యాలయం, సమాజంలో ఇతరులను కూడా కర్తగా భావిస్తారు; వారు అందరూ తమ అంచనాలకు అనుగుణంగా ప్రవర్తించాలని లేదా పని చేయాలని ఆశిస్తారు. ఈ పరిస్థితి నుంచి ఉత్పన్నమయ్యే విజయాలు, వైఫల్యాలు ఎప్పుడూ ఒకదాని వెనుక ఒకటి ఉంటాయి. దాని మూలంగా అపరాధం, పశ్చాత్తాపం, కోపం, కష్టాలకు లోనవుతారు. ఆధ్యాత్మిక ప్రయాణం యొక్క రెండవ దశలో ఒక ఘటన జరిగిన కొంతకాలం తర్వాత అవగాహన రావడం; ఈ అవగాహన కొన్ని క్షణాలు, సంవత్సరాలు, దశాబ్దాలు లేదా జీవితకాలం తర్వాత రావచ్చు. సంఘటనలు మన పై ఉన్న గుణాల ప్రభావం వలన మనం మాట్లాడే మాటలు కావచ్చు, మనం తీసుకునే నిర్ణయాలు లేదా మనం చేసే కర్మలు కావచ్చని గమనించాల్సివుంది. ఆఖరి దశలో, వర్తమాన క్షణంలోనే మనము కర్త కాదని; వాస్తవంగా, “కర్మలు అన్నియును ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుచుండును” అని గ్రహించడం (3.27). ఇది సాక్షిగా ఉండగలిగే ఒక కళ. అజ్ఞాని కూడా కాలక్రమేణా వారి స్వధర్మం ప్రకారం ఈ అవగాహన స్థితికి చేరుకుంటారు. అందువల్ల అజ్ఞానులకు భంగం కలిగించకుండా వేచి ఉండమని శ్రీకృష్ణుడు జ్ఞానులకు సలహా ఇస్తారు. మనమందరం మనం జీవిస్తున్న ప్రపంచం గురించి అనేక అపోహలు, మూఢనమ్మకాలను కలిగి ఉంటాము; అజ్ఞానులు వాటి యొక్క ఖైదీలు. వీటిని అధిగమించడమే మోక్షం.
Embed this episode
NOW PLAYING
72. అపోహల ఖైదీ
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.