EPISODE · Oct 24, 2020 · 26 MIN
'గోమెజ్ ఎప్పుడొస్తాడో'
from Harshaneeyam
'గోమెజ్ ఎప్పుడొస్తాడో' అనే ఈ కథకు రచయిత శ్రీ. వేలూరి వెంకటేశ్వర రావు గారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి లో జన్మించిన శ్రీ వెంకటేశ్వర రావు , తన విద్యాభ్యాసం అనంతరం, అమెరికా వెళ్లి సైంటిస్ట్ గా పనిచేసి , ప్రస్తుతం అట్లాంటా లో నివాసం వుంటున్నారు. వీరు ఇప్పటిదాకా రెండు కథ సంపుటాలను వెలువరించారు. 1980 దశకంలో 'తెలుగు వెలుగు' పత్రికను అమెరికా నించి నిర్వహించారు. కొంతకాలం 'ఈమాట' అంతర్జాల పత్రికకు సంపాదకులుగా వ్యవహరించారు. ఈ కథ వెంకటేశ్వర రావు గారి "ఆ నెల ఆ నీరు ఆ గాలి' అనే కథాసంకలనం నించి సేకరించబడింది. పుస్తకం కొనేటందుకు మరిన్ని వివరాలు 'వెబ్ పేజీ ' చివరలో ఇవ్వడం జరిగింది. ఈ కథలో ఆయన అమెరికాకు వచ్చే మెక్సికన్ ఇమిగ్రెంట్ లేబర్ అవస్థల గురించి చాల హృద్యంగా చిత్రీకరించారు. తానా వారు 2013 వ సంవత్సరం లో ముద్రించిన ' కథ - నేపధ్యం' అనే అనే ప్రత్యేక సంకలనం లో ఈ కథ ఎంపిక కాబడింది. కథను హర్షణీయం ద్వారా మీ కందించడానికి అనుమతినిచ్చిన శ్రీ వెకంకటేశ్వర రావు గారికి మా కృతజ్ఞతలు.గోమెజ్ ఇవాళా రాలేదు. పోయిన శనివారమే రావా ల్సినవాడు. పదు హేను రోజులకోసారి, శనివారం పొద్దున్నే వచ్చి లాస్ చెయ్యమని ఎన్నిసార్లు చెప్పినా వాడికి అర్థం కాదు. ప్రతీసారీ 'యస్ యస్, సీ సీ,' అంటూ నవ్వుతూ తలకాయ ఊపుతాడు. అంతే. వాడికి తీరికైనప్పుడే వస్తాడు. వచ్చినప్పుడు ప్రతిసారీ శ్రద్ధగా గడ్డికోసి, ఇంటి ముందు, వెనకా పెరిగిన పొదలన్నింటినీ అందంగా కత్తిరిస్తాడు. అదేం ఖర్మమో మరి! ఎప్పుడూ మధ్యాన్నం ఒంటిగంటకి వస్తాడు. కనీసం రెండు గంటలు మండు టెండలో పనిచేస్తాడు. రోడ్డు మీద ఎవరిని చూసినా చెయ్యి ఊపుతూ నవ్వుతూనే ఉంటాడు. అందుకనే కాబోలు, వాడు రావలసిన రోజున టైముకి రాలేదని సుజాత ఎంత చిరాకుపడినా గోమెజ్ చేతే లాన్ పను లన్నీ దగ్గిర ఉండి చేయిస్తుంది. తను మంచినీళ్లు తాగుతూ వాడికి కోక్ బాటిల్ ఇస్తుంది.గోమెజ్ కి ఇంగ్లీషు రాదు, యస్ యస్, అనడంతప్ప! ఇంగ్లీషు నేర్చు కుందామన్న కుతూహలం కూడా ఉన్నట్టు కనిపించదు. సుజాతకి స్పానిష్ రాదు. నేర్చుకుందామని అనుకోవడమే కాని, పనికట్టుకొని ఈ వయస్సులో కొత్త భాష నేర్చు కోవడానికి కావలసిన ఓపికా లేదు. అయితేనేం, వాళ్ళిద్దరూ చేతులతో సైగలు చేస్తూ సంభాషణ చెయ్యడం మూకీ సినిమాలని మరిపిస్తుంది. నిజం చెప్పొద్దూ! వీళ్ళ ముందు మార్సెల్ మార్సో ఎందుకూ పనికి రాడనిపిస్తుంది. గుబురుగా పెరిగిన పొదలు ఎంత ఎత్తు ఉంచాలో, ఎంత కిందకి కత్తిరించాలో, ఏ పూలమొక్కలు ఎప్పుడు ఎక్కడ తిరిగి పాతాలో, ఈ వివరాలన్నీ సుజాత చేతులు తిప్పుకుంటూ సైగలు చేస్తూ చెప్పడం, వాడు యస్ యస్! అని తలకాయ ఊపడం చూడముచ్చటగా ఉంటుంది. ఈ రెండేళ్ళన్నరలో వాడు సుజాతతో మాట్లాడుతూ నేర్చుకున్న తెలుగు మాటలు ముత్యంగా మూడు- ఆగు, ఇలారా, కాదు. సుజాత నానాయాతనా పడి వాడితో మాట్లాడుతూ నేర్చుకున్న స్పానిష్ మాటలు- అమీగో, సబాదో, దొమింగో.రెండున్నర సంవత్సరాల పైనే అయ్యింది సుజాత, మోహన్లు ఆ వీధిలో ఒక పెద్ద పాత ఇల్లు కొనుక్కొని. ఇంటి ముందు, వెనక ఖాళీస్థలం అర ఎకరం పైనే ఉంటుంది. ముందు పెద్ద లాను, రకరకాల పూల పొదలు. వెనక అటూ ఇటూ రెండు వీపింగ్ విల్లో చెట్లు ఉన్నాయి. వెనకాల సరిహద్దులో పెద్ద బర్మ్.దాని కింద ఆరడుగు లెత్తున హెడ్డింగ్ పొదలూ ఉన్నాయి. వాళ్ళు కొత్త ఇంట్లోకి చేరిన రోజునే ఎదురింట్లోకి కేథరీన్, ఫ్రాంక్ కూడా వచ్చారు. ఇద్దరికీ సంసార బాధ్యతలు, ఇతర బాదరబందీలు ఏవీలేవు. దానికి తోడు ఒకే వయసు వాళ్ళవడంతో సుజాతకి, కేథరీన్ కీ ఇట్టే స్నేహం కుదిరింది. రోజూ పొద్దున్నే లేచి సబ్ డివిజన్ లో వీధులన్నీ కొలుచు కుంటూ మెల్లిగా నడవడం, అమ్మకానికున్న ప్రతి ఇంటి మీదా కామెంట్లు చెయ్యడం, సాయంత్రం పూట ఎవరి డ్రైవ్ వేలో వాళ్ళు నిలబడి గంటల తరబడి పిచ్చాపాటీ చెయ్యడం అలవాటయ్యింది. సుజాత అమెరికా వచ్చి ము ప్ఫై ఏళ్ళయ్యింది. ఇన్ని ఏళ్ళున్నా ఫలానా తెల్లవాళ్ళు స్నేహితులు అని చెప్పుకోవటానికి ఎవరూ ఉన్నట్టులేదు. అలాగని నల్లవాళ్ళూ కూడా లేరు. ఇంతకుముందు వాళ్ళున్న ఇంటి సంగతి సరేసరి! తను పెరట్లోకి వెళ్ళితే చాలు, తను చెయ్యి ఊపుతూ పలకరిద్దామనుకున్నా ఆవెనకింటి ఆవిడ హాయ్ అని కూడా అనేది కాదు! ఈ సబ్ డివిజన్ లోకి రావడం, వచ్చిన రోజే కేథరీతో స్నేహం కుదరడం కలిసివచ్చింది.ఒక శనివారం సాయంత్రం సుజాత, కేథరీన్ కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ట్రక్ నిండా పైన్ స్ట్రా బేళ్ళు పెట్టుకొని ఒక పాతికేళ్ళ కుర్రాడు వచ్చాడు. ఒక కట్ట పైన్ స్ట్రా చేత్తో పట్టుకొని, ఇంటిముందు చెట్లకుదుళ్ళకి స్ట్రా వేస్తానని సైగ చేస్తూస్పానిష్ లో వటవట వాగడం మొదలెట్టాడు. కాథెరీన్ మాట్లాడద్దని తర్జని తన పెదాల పై పెట్టుకొని సైగ చేస్తూ, 'హౌ మచ్?' అని అడిగింది. వాడు మూడు వేళ్ళు చూపించాడు. అంతే! కేథరీన్ ఇంటి ముందు, సుజాత ఇంటి ముందూ చెట్లకి, పొదలకీ ఓపిగ్గా కుదుళ్ళు చేసి పై' వేశాడు. బహుశా ఒక్కొక్క ఇంటికి పాతికబేళ్ళు పట్టి ఉంటాయి. అంటే డెబ్బై ఐదు డాలర్లు! ఏ హోమ్ డిపోలోనో పైన్ స్ట్రా కొంటే నూటపాతిక పైనే అవుతుంది. దానికి తోడు, అది తెచ్చి వేసినందుకు కూలి కనీసం మరో పాతిక డాలర్లు. చులాగ్గా ఒక్కొక్కళ్ళకీ నూట యాభై డాలర్లు ఖర్చు. సుజాత, కేథరీన్ లిద్దరికీ కలిపి నూటయభై డాలర్లతో ఇంటి ముందు అన్ని చెట్లకీ, పొదలకీ పైన్ స్ట్రా చవగ్గా దొరికింది.సుజాత, కేథరీన్ ఇద్దరూ ఒకేసారి వాడిని, 'గడ్డి కూడా కోస్తావా?' అని సైగ చేశారు, లాన్ చూపిస్తూ! వాడు యస్, యస్ అన్నాడు. కేథరీన్ కి సుజాతకన్నా ఓ నాలుగు స్పానిష్ మాటలు ఎక్కువ వచ్చు. ఇంగ్లీషు, స్పానిష్ కలిపి మాట్లాడేస్తుంది. వాడిని, 'లాన్ మోవర్ ఉన్నదా?' అని అడిగింది, వచ్చీరాని స్పాంగ్లిషే! వాడు, 'సీ, సీ' అన్నాడు చిరునవ్వు నవ్వుతూ! లాన్ చెయ్యడానికి ఎంత కావాలి, అని కూడా అడగలేదు. అడగడం ఎల్లాగో తెలిస్తేగా! ఆ రోజునుంచీ సుజాతకీ, కేథరీన్కీ గోమెజ్ తోటమాలి. ఇద్దరూ కూడబలుక్కొని చెరో ము ప్ఫై డాలర్లు ఇద్దామనుకున్నారు, అంతే.ఆ నెల వర్షాలు బాగా పడ్డాయో ఏమో, రెండు వారాలు తిరక్కుండా ఇంటి ముందు గడ్డి కనీసం అరడుగు పైగా పెరిగింది. వెనక బల్మ్ మీద డాన్ డెల్యన్ కలుపు మొక్కలు పెరుగుతున్నాయి. గడ్డి కొసన సన్నగా మట్టిరంగు పూలు కూడా పూస్తున్నాయి. వారం నుంచీ సుజాత గోమెజ్ కి ప్రతిరోజూ టెలిఫోన్ చేస్తూనే ఉన్నది.గోమెజ్ దగ్గిర నుంచి సమాధానం లేదు.అప్పటికి రెండు నెలల కిందట వీధి చివర కార్నర్ లో ఉన్న పెద్ద ఇంట్లోకి కొత్తగా గుజరాతీ వాళ్ళు దిగారు, రెండు హోండాలు, ముగ్గురు పిల్లలతో సహా! ఈ ఇల్లు ఏడాది నుంచీ అమ్మకానికుంది. కార్నర్ లో ఉన్న ఇళ్ళు తొందరగా అమ్ముడు పోవు కాబోలు! కారణం, మిగితా ఇళ్ళకన్నా ఖాళీస్థలం భారీగా ఉంటుంది అందు లోనూ, ఈ ఇల్లు కొండ మీద ఉన్నట్టే ఉంటుంది. మూడు పక్కలా స్థలం కూడా సుజాత ఇంటికన్నా బాగా పెద్దది. రెండు లాట్లు కలిపి కట్టిన ఇల్లు. ఇల్లు ఫోర్ క్లోజర్ లోకి పోయింది కాబట్టి బాగా చవగ్గానే దొరికి ఉండాలి గుజరాతీ ఫేమిలీకి. వాళ్ళు ఇంట్లోకి దిగిన రెండో రోజున సుజాత, కేథరీన్, ఇద్దరూ ఒక క్రోటన్ మొక్క తీసుకొని 'వెల్కమ్ టు నైబర్ హుడ్' అని చెప్పటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆవిడ ఇచ్చిన టీ తాగుతూ వచ్చీరాని హిందీలో వాళ్ళ భోగట్టా కనుక్కుంది సుజాత. ఆవిడ పేరు మాలిని; ఆయన పేరు జాయ్. అతనికి ఏదో ట్రక్కింగు కంపెనీ ఉందిట. ఆవిడ పిల్లలని బళ్ళో దింపిన తరువాత స్వామినారాయణ్ గుడిలో వాలంటీర్ పనికి పోతుం దిట. వాళ్ళ గురించి ఇంత సొద ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, సుజాత రికమం డేషన్, గోమెజ్ వాళ్ళకి ఒకే ఒక్కసారి లాన్ కూడా చేశాడు, అందుకని!సుజాత గోమెజ్ జాడ గురించి కేథరీనిని అడిగింది. ఆ సాయంత్రం మాలిని ఇంటి ముందు ఆగి ఆవిడని కూడా అడిగింది. ఆవిడ ఏదో గుజరాతీలోనో, హిందీ లోనో గొణిగింది. సుజాతకి ఒక్క మాట కూడా అర్థం కాలేదు. కేథరీన్ కూడా రోజూ టెలిఫోన్ చేస్తూనే ఉన్నది. కాని, ఫలితం శూన్యం.గోమెజ్ శనివారం, ఆదివారం మాత్రమే లాన్ పని చేస్తాడు. మిగిలిన ఐదు రోజులూ వందమైళ్ళ దూరంగా ఏదో పూల మొక్కల కంపెనీలో పని చేస్తాడు. వీడితో పాటు నలుగురు అమీగోలు రోజూ పొద్దున్నే ఆ కం పెనీకి వెళ్ళి రాత్రి పదిగంటలదాకా తిరిగి రారని కేథరీన్ భోగట్టా. అందుకనే కాబోలు, ఎవరు ఎన్నిసార్లు ఫోను చేసినా సమాధానం ఇవ్వడు.'కాస్త నమ్మకంగా, ఖచ్చితంగా రెండువారాల కొకసారి వచ్చి లాస్ చేసేవాడిని, మరొకణ్ణి చూసుకోవాలి,” అని ఇద్దరూ అనుకుంటారు, గోమెజ్ రానప్పుడల్లా!గోమెజ్ రాగానే ఇద్దరూ ఆ విషయం మరిచిపోతారు! కారణం, వచ్చినప్పుడు లాన్ పని బాగా చేస్తాడు. పై పై పనులెన్ని చెయ్యమని చెప్పినా విసుక్కోడు; అందుకుగాను పైకం అడగడు; టిప్ ఎంత ఇస్తే అంతే తీసుకుంటాడు. నవ్వుతూ యస్ యస్ అంటాడు. అంతే!గోమెజ్ వస్తాడని చూసిచూసి చివరకి విసుగెత్తి, సోమవారంనాడు పొద్దున్నే యెల్లో పేజీల్లో చూసి ఏదో సర్వీసు కంపెనీని పిలిచింది, కేథరీన్. ఆ విషయం సుజాతకి చెప్పింది. ఆ కంపెనీ వాళ్ళు యూనిఫారాలు వేసుకొని, పెద్ద ట్రక్ లో వచ్చారు, మధ్యాన్నానికల్లా! మొత్తం ముగ్గురొచ్చారు. రెండు ఇళ్ళ ముందూ వెనకా లానులు పరీక్షగా చూశారు. ఒకడు టేపుతో కొలతలు కూడా తీసుకున్నాడు. మొట్టమొదటిసారి గడ్డి కోసి బుషులన్నీ కత్తిరించి పూలమొక్కలన్నింటికీ కుదుళ్ళు తవ్వి శుభ్రం చెయ్యడానికి ఒక్కొక్కళ్ళకీ నూటైయభై డాలర్లు అవుతుందని అంచనా ఇచ్చారు. వారానికొకసారి లాను పని చేయించుకుంటామని కాంట్రాక్ట్ రాస్తే, ప్రతివారం అరవై ఐదు డాలర్లకి లాన్ చేస్తామని, పూల పొదలు బుషులు కత్తిరించడానికి వేరే నెలకి నలభై డాలర్లు అని చెప్పి రిబేట్ కాయితాలు, కాంట్రాక్ట్ కాయితాలూ అన్నీ కేథరీన్ కి, సుజాతకీ ఇచ్చి రెండు రోజుల్లో పిలిచి ఏ విషయం చెప్పండని వెళ్ళిపోయారు.వీళ్ళిద్దరికీ గుండె ఆగినంత పని అయ్యింది. 'ఇది నిలువు దోపిడీ,' అని సుజాత, 'హైవే రాబరీ,' అని కేథరీన్ ఒకేసారి అనేశారు. వస్తానని చెప్పి, మాట నిలబెట్టుకోకండామోసం చేసి ఎగగొట్టినందుకు, గోమెజ్ ని నానా తిట్లు తిట్టుకున్నారు: సుజాత తెలుగులోను, కేథరీన్ ఇంగ్లీష్ లోనూ!అయినా తప్పదు కదా!ఈ దేశంలో, ఎవడి ఇల్లు వాడు లోపల ఎంత చెత్తగా పెట్టుకున్నా పరవాలేదు. శానిటరీ డం' వున్నా నష్టం లేదు. 'నా ఇల్లు. నా సొంతం' అని దబాయించవచ్చు. ఇండివిడ్యువల్ ఫ్రీడం! కానీ, ఏ ఇంటి ముందు, వెనకా ఖాళీస్థలంలో గడ్డి ముత్యంగా మూడంగుళాలకన్నా ఎత్తుగా పెంచకూడదు. ఏ ఇంటి ముందన్నా కాస్త గడ్డి గాదర దుబ్బుగా పెరిగితే, ఇంటి ధరలు అమాంతం పడిపోతాయని బెంబేలు పడిపోతారు, ఇక్కడి జనం! ఇరుగుపొరుగు వాళ్ళు టౌన్‌హాలుకి పిలిచి రిపోర్ట్ చేస్తారు కూడాను! టౌన్‌హాల్ వాళ్ళే గనక మీ ఇంటి ముందు గడ్డి కోయిస్తే తడిసి మో పెడవుతుంది. అంతేకాదు; అది అప్రతిష్ట కూడాను! పెద్ద న్యూసెన్స్! అందుకైనా గడ్డి కోయించి తీరాలి.ఆ రోజు బుధవారం.పొద్దున్నే సబ్ డివిజన్లో నడుస్తూ, కేథరీనూ, సుజాతా ఇవాళ సర్వీసు కంపెనీని పిలుద్దామని ఒప్పందం చేసుకున్నారు. మిట్టమధ్యాన్నం. జులై ఎండ మాడ్చే స్తూన్నది. కాసేపు కునుకు తీద్దామని సోఫాలో వాలింది, సుజాత.అరగంట కూడా పట్టలేదు ఉలిక్కిపడి లేచింది, బయట లాన్ మోవర్ చప్పుడుకి! తలుపు తీసి చూసింది. అదేమీ మామూలు లాస్ మోవర్ కాదు. చక్కగా సీటు మీద కూర్చొని గడ్డి చేసుకునే మోవర్. కావి రంగు హోండా రైడింగ్ మోవర్. వెనక పెద్ద గోనె సంచి; పక్కన మరో మనిషి నిలబడటానికి చిన్న ఇనప మెట్టు కూడా ఉన్నట్టున్నది. గోమెజ్ బండి నడుపుతున్నాడు; పక్కనే మరో అమీగో హుషారుగా చేతులూపుతున్నాడు. సుజాతని చూడగానే గోమెజ్ ఎడమచెయ్యి ఊపుతూ హాయ్ అని సైగ చేసి మోవర్ ఆపాడు. వాడి స్నేహితుడిని గుమ్మం దగ్గిరకి తీసుకొని వచ్చాడు. సుజాత సైగ చెయ్యకముందే, వాడికేసి చూపుడు వేలు చూపిస్తూ 'మార్సెలీనో' అని చెప్పాడు. చూస్తే వీడికి పదిహేను పదహారు ఏళ్ళకన్నా ఎక్కువ వయస్సుండదు. మార్సెలీనోని 'ఇంగ్లీషు అర్థం అవుతుందా?' అని అడిగింది, సుజాత. వాడు వెంటనే 'లిటిల్..... లిటిల్...' అని సమాధానం చెప్పాడు. వీడే నయం. ఆ గుజరాతీ ఆవిడయితే 'థోడా థోడా' అనేది. ఇంతలో ఎదురింటి కేథరీన్ కూడా బయటికొచ్చింది. చెప్పద్దూ! కేథరీన్ కీ, సుజాతకీ మొహాలు విప్పారిపోయాయి.గోమెజ్ మోవర్ ఎక్కి గడ్డి చెయ్యడం మొదలు పెట్టాడు; కేథరీను మార్సెలీనోతో మాట్లాడటం మొదలెట్టింది. రకరకాల ఆరాలు తీసింది. రైడింగ్ మోవర్, వాళ్ళు పని చేసే పూలకం పెనీ ఓనర్ ది. రోజుకి...
NOW PLAYING
'గోమెజ్ ఎప్పుడొస్తాడో'
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.