'కొత్త షూసు' - వీ మల్లికార్జున్ గారి 'నల్లగొండ కథలు' నుంచి. episode artwork

EPISODE · Jan 16, 2021 · 7 MIN

'కొత్త షూసు' - వీ మల్లికార్జున్ గారి 'నల్లగొండ కథలు' నుంచి.

from Harshaneeyam

ఇప్పుడు మీరు వినబోయ్యే ' కొత్త షూసు' కథ , వీ మల్లికార్జున్ గారు రాసిన 'నల్లగొండ కథలు' పుస్తకం లోనిది. ఇది ఆయన మూడవ కథాసంకలనం.2020 సంవత్సరంలో రిలీస్ అయిన పుస్తకాల్లో, ఇది ఒక ఆణిముత్యం లాంటి పుస్తకం అని మనం చెప్పుకోవచ్చు. ఇరవై ఎనిమిది ఏళ్ల యువ రచయిత మల్లికార్జున్ గారు రాసిన ఈ పుస్తకంలో, 21 కథలున్నాయి. అన్నీ కథలు , నల్లగొండలో గడిపిన తన బాల్యాన్ని గుర్తుచేసుకుంటూ , అతి హృద్యంగా మనకందించినవి.ఈ పుస్తకాన్ని కొనడానికి కావలసిన వివరాలు ఈ లింకులో మీరు చూడొచ్చు. (http://bit.ly/nallagonda-kathalu) కథను మీకందించడానికి అనుమతినిచ్చిన మల్లికార్జున్ గారికి కృతజ్ఞతలు.చిన్నప్పుడు - అంటే చానా చిన్నప్పుడు నాకు రింగుల జుట్టు ఉండేటిదని మా అమ్మ చెప్తది. రింగుల జుట్టంటే అట్లాంటి ఇట్లాంటిది కాదు. పల్లగ ఇంతింత కుచ్చు లెక్క ముఖం నిండ ఉండేటిదంట. ఆబ్కారాయన ఇంటి ముందల ఒరండాల కూసొని ఎర్రటి అంగి మీద, ఇంతింత రింగుల జుట్టేసుకొని దిగిన ఫొటోల మటుకే నేను ఆ రింగుల జుట్టు చూసుకున్న గుర్తు. ఆ ఫొటో జూసి మురుస్తుంటి. చిన్నప్పుడు నాకు మా అమ్మోళ్లు తీశిన ఫొటోలు మూడుంటే అందుల ఇదొకటి. ఈ ఫొటో అటెన్క ఏడ్నో పోయింది. సూసుకుందామన్నా ఆ రింగుల జుట్టు సూస్కుంటానికి లేదిప్పుడు.అయితే ఆ ఫొటోల నాకు నా రింగుల జుట్టుకంటేగూడ, నేను తొడుక్కున్న ఎర్రటి బూట్లు ఎక్కువిష్టం.అవి ఎట్లాంటి షూసంటే కింద పీక ఒకటి ఉంటది. నడుస్తుంటే సౌండ్ చేస్తది. ఉరికినమంటే ఇంగంతే. నేనేసుకున్న ఫస్టు షూసు అదేనని నాకు గుర్తు. దాని తర్వాత స్కూల్లగూడ యూనిఫామ్ ఉండేటిదిగానీ, షూసు ఏస్కోవాలని ఏం లేదు. రబ్బరు చెప్పులే ఏస్కునేది.స్కూల్ కి అట్ల పోతుంటమా, వేరే స్కూలోళ్లని చూశి, ఆళ్లకు షూసుంటే మనగూడ ఉంటే బాగుండె కదా అనుకునేటోడి. ఎందుకో షూసంటే అంత పిచ్చి. . ఇంటికెవలన్న షూసేస్కొని వస్తే అటు దిక్కే చూస్తుండె. షూసేస్కొని ఫొటో దిగినట్లు, స్టయిలు పడ్డట్టు, ఎన్నో కలలు కంటుండేటోడ్ని.నేను పెద్దగయితున్న కొద్దీ కొద్దీ షూస్ పిచ్చి అట్ల పెరుగుతనే వచ్చింది. కొనియ్యమని అడుగుదామంటే భయం. మా సదువులు, తిండికే అప్పులు చేసేటంత పేదరికమాయె. ఏమని అడుగుతం?సినిమాలల్ల హీరోలను చూశి, “ఈళ్లు ఎన్నెన్ని షూసు మారుస్తున్నరో గదా!” అనుకునేటోడ్ని. ఒక్కో సినిమాల హీరో ఎన్ని షూసు ఏసుకున్నడో కూడా లెక్కబెట్టేది."అరెయ్, ఇన్ని షూస్ ఎట్ల కొంటున్నరో” అనుకునేది.అట్ల విచిత్రంగ నా షూసు పిచ్చి పెరుగుతనే ఉన్నదా, ఒకరోజు నేను స్కూల్ నించి ఇంటికొచ్చేసరికి మా నాన్న నాకోసం కొత్త షూసు తెచ్చిచ్చిండు. అయి మల్ల మామూలు షూసా? రన్నింగ్ షూసు.“ఎక్కడియే !” అనడిగిన. “ఎక్కడియయితేందిరా!” అన్నడు. ఏస్కొని చూసిన. కరెక్టుగ సరిపోయినయి. ఆహా! ఆ షూసు నేను ఎన్ని తీర్ల, ఎన్ని పండుగలకి ఏసుకున్ననో చెప్తే గూడ ఒకకథ అయితది. కానీ నేను ఆ షూసు మా నాన్నకి, మా నాన్ననించి నాకు ఎట్ల వచ్చినయో చెప్పాలి. దానికి మళ్లా మా నాన్న కథకాడికే పోవాలి.మా నాన్న ఊర్నించి పారిపోయొచ్చి నల్లగొండల ఆబ్కారాయన దగ్గర చేరిండుగదా! అటెన్క పెండ్లయింది. అమ్మ అదే ఇంట్ల ఆ పని ఈ పని సూస్కుంటుంటే, నాన్న కొండచెల్మ బాయిల నీళ్లు తోడే ఇంకో పని పెట్టుకున్నడు.కొండచెల్మ బాయంటే నల్లగొండల ఎవ్వల్ని అడిగినా చెప్తరు. తేటగ తియ్యగ ఉంటయి నీళ్లు. ఎక్కడెక్కడ్నించో జీపుల క్యాన్లు తెచ్చుకొని తీస్కపోయేటిది.ఆ బాయి నించి నీళ్లు తోడి క్యాన్లల్ల నింపి ఇండ్లల్ల పోసుడు మా నాన్న పని. పెద్ద క్యూ ఉండేటిదంట ఆ నీళ్లకోసం. తెల్లారుజామునే లేశిపోయి బాయికాడ నీళ్లు నింపుకొని సైకిల్ కి కట్టుకొని ఇంటింటికి తిరిగి పోసేటోడు మా నాన్న. అట్లజేస్తే నెలకు ఇంటికి ఇరవై రూపాయలు. రోజుకి రెండు క్యాన్ల నీళ్లు పొయ్యాలి. నల్లగొండల పెద్దపెద్దాళ్ల ఇండ్లల్ల మా నాన్నదే నీళ్లు పోసే పని.ఒకసారి ఎర్రటి ఎండాకాలంల బాయిల నీళ్లు ఎండుకపోయినయి. అడుగు మడుగున ఏవో ఉన్నయంట. లోపలికి దిగితేగానీ నీళ్లు అందవు. కొండచెల్మ బాయికి కొన్ని మెట్లుంటయి. మా నాన్న చిన్నగ ఆ మెట్లమీంచి లోపలికి దిగి నీళ్లు తోడుతున్నడంట. పాకురుబట్టిన మెట్లాయె. దమ్మనిజారి అందుల పడ్డడంట. ఏముంది? తుంటి బొక్క ఇరిగిందన్నరంట.అప్పటికి పెద్దక్క చిన్నది. పెద్దక్కని ఎవలో పాలోలింట్ల ఇడ్నిపెట్టి అమ్మ, నాన్న కల్ని ఓ ముప్పై కిలోమీటర్ల అవతల ఒక కాడ పసరు కట్టు కడ్తరంటే ఆడికి పోయిన్రంట. ఆ ఊరు కనుక్కొని, ఆడ ఉండి కట్టు కట్టిచ్చుకొని మళ్లా నల్లగొండల పడ్తానికి ముప్పు తిప్పలు పడ్డరంట.పసరు కట్టుతోటి ఊళ్ల దిగిండు. కొన్నిరోజులు ఇంట్లనే ఉన్నడుగానీ, పనిజెయ్యకుంట ఉండలేని మనిషాయె, ఇట్లనే నీళ్లు పోస్తప్పుడు పరిచయమైన ఒకాయనకాడికి పోయిండంట. ఆయనకి ఒక సినిమా టాకీస్ ఉంది. అందులనే అనౌన్సుమెంట్ ఇచ్చే రిక్షా తొక్కే పనిల పడ్డడు.పసరుకట్టు కట్టినంక కొన్ని నెలలు రెస్ట్ తీసుకోవాలి. ఈయన అదేం పట్టించుకోకపోయేసరికి కాళ్ళు కొంచెం వంకర పోయినయ్. ఒకసారి ఇట్లనే , ఒక పెద్దాయన , “ మారయ్యా, నీకు హ్యాండీక్యాప్డ్ పాసిస్తారు తీస్కో” అంటే డాక్టర్ సర్టిఫికెట్ దగ్గర ఒక రిపోర్ట్ వచ్చిందంట.“ఓ మారయ్యా! నువ్వు బతుకుడు కష్టమే” అని ఆడుకున్నడంట ఆ టాకీస్ ఓనరాయన. “ఏది, నీకు కాళ్లు ఎట్ల ఇరిగినయో చూపియ్యరా.”“కుంటోనివి ఎట్లయినవో చెప్పురా” అని ఆటపట్టించేటిదంట...అప్పుడే ఎవలో తెలిసినాయన ఒకాయన హైదరాబాద్ ఉస్మానియా ల పనిచేస్తడంట . “మారయ్యా, నువ్వేం ఫికరు చెయ్యకు. నేను దీస్కపోత” అని అన్ని ఆయననే చూసుకున్నడంట. ఆపరేషన్ అయ్యింది. కాళ్లకు ఇనుప పట్టీలు కట్టిన్రంట . నల్లగొండకి తిరిగొచ్చి కొన్ని నెలలు ఇంట్లోనే ఉన్నడు. మా నాన్న సంగతి తెల్సిందే గదా, ఒక్కకాడ ఉంటడా?“అయ్యో, ఏం చెయ్యకుంటే ఎట్ల ఎత్తది?” అని అందరినీ కాదని మళ్ళా పనిలవడ్డడు. అక్కడ, ఇక్కడ పనిచేసి మళ్లా ఆ సినిమా టాకీస్ట్ గేట్ కీపర్లో, స్వీపర్ గ పనికి కుదిరిండు.ఆ కాలుని పట్టిచ్చుకోలేదుగా, అది అట్లనే ఉంది. ఒక కాలు కొంచెం ఒంకరుంటది. పాదం నేల మీద ఆనది. సగం పాదం మీదనే నడ్వాలి.హ్యాండీ కేఫ్ట్ సర్టిఫికెట్ తెప్పిచ్చుకున్నడు. బస్ పాసు , రైలు పాసు వచ్చినయి. రైల్ల తిరుపతికి తప్ప ఇంకేడికీ పోలేదుగానీ, బస్సు పాసుని మాత్రం మంచిగ వాడిండు మా నాన్న.వికలాంగుల దినోత్సవం మీటింగులు అయితే పోతుంటడు. ఒకసారి అట్లాంటిదే ఒక రోజేదో, మా నాన్న అసోంటోళ్లకు షూసు, మొత్తం కాళ్లు నడ్వనోళ్లకు బండ్లు ఇచ్చిన్రు.మా నాన్నకి ఇచ్చిన షూసు పాదం మొత్తం నేల మీద పెట్టలేడుజేబట్టి షూసు లోపటనే ఒక ఎత్తు ఉంటది. అది బ్యాలెన్స్ చేస్తదన్నట్టు. “నీకే ఇచ్చిన్రు కదనే! ఏస్కో ఏమైతది” అని నేనన్న. “హేయ్, గమ్మత్తు మాట్లాడుతవేం రా. గివి నేనేడ తొడుగుత” అన్నడు.“నీకే ఇచ్చిన్రు కదనే..”“నాకే ఇచ్చిన్రులేరా. గీ బూట్లు నేనేడ తొడుగుత? నవ్వుతరు ఎవలన్న చూస్తే!” అని నవ్వి నా చేతుల పెట్టిండు.నేను ఆ షూసు తీసుకొని లోపట ఎత్తులు తీశి చూసిన్నా, నాయే అయిపోయినయి ఆ షూసు.అయి ఏస్కొనే నా పుట్టినరోజు చేస్కున్న. స్కూల్ల పిల్లలు టీచర్లయ్యే రోజు నేను హెడ్మాస్టరయి గూడ అదే షూసు ఏస్కున్న. ఏదో ఫేర్వెల్ పార్టీకి ఏసుకున్న. ఇంకేదో పెండ్లికి ఏసుకున్న. ఇంకెయ్యొ పండగలప్పుడు ఏసుకున్న. అట్ల ఆ రన్నింగ్ షూసు నేను ఇష్టంగా తొడుక్కున్న ఫస్టు షూసు అసొంటివే.ఇయ్యాల్టికీ ఎప్పుడు కొత్త షూసు కొన్నా, అయ్యాల మా నాన్న ఆయన కాళ్లకు ఎన్నటికీ తొడగని ఆ రన్నింగ్ షూసే గుర్తొస్తయి. అటెమ్మటే ఎర్ర రంగున్న కీచుమని సౌండుజేశే నా ఫస్టు షూసు గుర్తుకొస్తయి. ఆ రింగుల జుట్టున్న ఫొటో ఎప్పటికన్న దొరికితే బాగుండనిపిస్తది.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

NOW PLAYING

'కొత్త షూసు' - వీ మల్లికార్జున్ గారి 'నల్లగొండ కథలు' నుంచి.

0:00 7:38

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Harshaneeyam?

This episode is 7 minutes long.

When was this Harshaneeyam episode published?

This episode was published on January 16, 2021.

What is this episode about?

ఇప్పుడు మీరు వినబోయ్యే ' కొత్త షూసు' కథ , వీ మల్లికార్జున్ గారు రాసిన 'నల్లగొండ కథలు' పుస్తకం లోనిది. ఇది ఆయన మూడవ కథాసంకలనం.2020 సంవత్సరంలో రిలీస్ అయిన పుస్తకాల్లో, ఇది ఒక ఆణిముత్యం లాంటి పుస్తకం అని మనం చెప్పుకోవచ్చు. ఇరవై ఎనిమిది ఏళ్ల యువ రచయిత...

Can I download this Harshaneeyam episode?

Yes, you can download this episode by clicking the download button on the episode player, or subscribe to the podcast in your preferred podcast app for automatic downloads.
URL copied to clipboard!