'నా పేరు సొంబరా '  - మల్లిపురం జగదీష్ గారు episode artwork

EPISODE · Nov 27, 2020 · 26 MIN

'నా పేరు సొంబరా ' - మల్లిపురం జగదీష్ గారు

from Harshaneeyam

హర్షణీయంలో వినబోతున్న కథ శ్రీ మల్లిపురం జగదీష్ గారు రచించిన 'నా పేరు సొంబరా'ఇది వారు రచించిన 'గురి' కథాసంకలనం లోనిది. (ఈ పుస్తకం లభ్యత గురించిన వివరాలు ఇదే వెబ్ పేజీ క్రిందిభాగం లో ఇవ్వబడ్డాయి.)ఏజెన్సీ ప్రాంతాల్లోని జన జీవన సమస్యలపై సాధికారంగా రచనలు చేస్తున్న జగదీశ్వరరావు గారు, విజయనగరం జిల్లాలోని ఒక గిరిజన గ్రామంలో జన్మించి, 'టిక్కబాయి' ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తూ, రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు.ఇంతకు మునుపు వారు రాసిన 'సిల కోల' కథాసంకలనంలో కానీ, 'గురి' అనే ఈ కథా సంకలనంలో కానీ, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన కథల రూపంలో విస్తృతంగా చర్చించడం జరిగింది.ఈ కథ ద్వారా రచయిత , గిరిజనుల జీవితాల్లో వస్తున్న కొన్ని సామాజిక మార్పుల గురించి , వాటి కారణంగా ఉనికిని పూర్తిగా కోల్పోతూ , వారు పడుతున్న వేదన గురించి మన మనసుకు హత్తుకునేలా నివేదిస్తారు.కథ ఆడియో చివరన , జగదీష్ గారు , కథానేపధ్యాన్ని గురించి తెలియజేయడం జరుగుతుంది. హర్షణీయం ద్వారా మీకు తన రచనను అందించడానికి అనుమతినిచ్చి, శ్రోతలకు కథ గురించి వివరించిన జగదీష్ గారికి కృతజ్ఞతలు.* కథలో బోల్డ్ ఫాంట్ లో వున్న పదాలకు , పేజీ చివరన అర్థాలు ఇవ్వడం జరిగింది. నా పేరు సొంబరాకలెక్టరు కార్యాలయం... గ్రీవెన్స్ రోజు. గుంపులు గుంపులుగా జనం. సమస్యలన్నీ సాయం కోరుతూ. వరండా నిండా వరుసల్లో. ఎదురు చెట్ల కింద చెల్లా చెదురుగా ఎవరి ఆతృత లో వాళ్ళు.ఊపిరాడని ఉక్క,  ఒళ్లంతా చెమట, చికాకు. క్షణ క్షణం నాలో అసహనం. ఎవరి మీదో చెప్పుకోలేని కోపం. వరండా చివర టాయిలెట్స్ లో దూరి ముఖమ్మీద నీళ్లు చల్లుకున్నాను. రిలాక్స్ అయ్యాను. ఎదర అద్దం. నన్ను నేను చూసుకున్నాను.వెడల్పాటి ముక్కు, విశాలమైన నుదురు, వంపులు తిరిగిన జుట్టు. నా వయసప్పుడు నాన్న ఇలాగే వుండి వుంటాడు.నాన్న ఇప్పుడు ఉండివుంటే, అన్నదమ్ముల్లా వుండే వాళ్ళం.నేను పుట్టగానే తాత, నాన్నని కౌగిలించుకొని ముద్దులాడేడట.“నిలబెట్టేవురా! జాతి కాపు కాసినోడివనిపించేవురా!!” అని , రెండు ఎడ్లని కొని కానుక గా యిచ్చేడట. పుట్టిన వెంటనే నన్ను చేతుల్లోకి తీసుకొని అడవి వైపు చూపిస్తూ 'ఇదిగో నా రాజు... అడివికే రారాజు" అని గర్వంగా తాతల్నందర్నీ స్మరించుకున్నాడట.నేను పుట్టడం ఇంటికే కాదు, ఊరికే పండుగట. ఎందుకంటే వూరికి పెద్ద అయిన తాత కి పుట్టిన ముగ్గురన్నదమ్ముల్లో అందరికీ ఆడపిల్లలే. చిన్నవాడైన నాన్నకి పుట్టిన ఏకైక మగ సంతానం నేను.నాకు గుర్తొస్తోంది....తాత భుజమ్మీద గుర్రంపండేసుకుంటే తాత వుంగరాల జుట్టు పట్టుకుని నేను రాజునై వీధులన్నీ ఊరేగేను. రెండు చేతుల్లోనూ కిన్నెర పట్టుకుని నన్ను పాటలు పాటలుగా తిప్పేవాడు తాత. అదే భుజాల మీద డప్పు దరువుల్లో కొత్త వూర్లు, కొత్త కొండలూ, వింత వింతల అడవీ చూసేను. ఆ భుజాల మీదే... తాత పెదాల మీద పలికిన పిన్ల కర్ర పాటల్లో ముత్తాతల గొంతులు విన్నాను. మా ఇద్దరి వైభవం చూసి వూరంతా ముచ్చట పడేది.నాకు పేరు పెట్టడానికి ఇంటికి ఆకుల తోరణం కట్టించేరట. ఎజ్జోడిని పిలిపించి ఇంటి దేవత మూల "కానికు” వేయించేరు. దీపం వెలుగులో అమ్మ ఒడిలో వున్న నన్ను తాత ఎత్తుకుని చేటలో బియ్యం నెరుపుతు గుగ్గిలం వేసి ధూపం పట్టేరట. ఎజ్జోడు ముంతలో నీళ్లను చిలకరిస్తూ రాగాలు తీసి దేవతలందరినీ స్మరించేరట. మా వంశం లోని అందరి పేర్లూ గొంతెత్తి పలుకుతున్నాడట. ఒక్కొక్క పేరుకీ ఒక్కొక్క బియ్యం గింజను నీటిలో వేస్తున్నాడట. చుట్టూ మూగిన చుట్టాలు. వూరి వాళ్లూ, బంధువులూ ఆతృతగా ఆ ముంతలోని బియ్యం గింజలు వైపే చూస్తున్నారట. ఏ పేరు పలికినపుడు గింజ నీటిలో మునుగుతుందో అదే నా పేరు.మంగడూ... బారికీ... ఆ లక్కాయీ... సన్నాయీ... సుక్కూ ... సొంబరా...చివరి పేరుకి బియ్యం గింజ నీట మునిగింది. ఒక్కసారిగా ఉల్లల ఉత్సవం... వూరంతా వెలుగు. తాత ఒక్కసారిగా ఎగిరి గెంతేసేడు. వీధుల వెంట నన్నెత్తుకుని ఊరేగించేడు. తుడుం కుండ నడుముకి కట్టి నడిరేయి దాకా వాయిస్తూ... ఏజామునో నిదుర పోయేడట. తాత కంత సంబరం. ఎందుకంటే... నాకు దేవతలిచ్చిన పేరు ఎవరిదో కాదు, మా తాతదే. “నా జాతిని నిలబెడతాడు... నా మనవడు” అనే కన్ను మూసేడు తాత.----------------------------------------------“రాబర్టూ! రాబర్టూ!!” ఎవరో పిలుస్తున్నారు. నన్నే... నన్నే.... నన్నే.నా పిడికిలి బిగుసుకుంది. బలంగా గాల్లోకి చేయి విసిరేను. ఎదురుగా వున్న అద్దం ముక్కలయ్యింది. నా గుండెలాగే.ఇప్పుడు నా పేరు రాబర్ట్ విల్సన్... ఔను రాబర్ట్ విల్సన్.నన్ను నా నుంచి దూరం చేసిన పేరు, నేను నేను కాకుండా పోయిన పేరు. గుండెలోని గాజు పెంకుల్ని కెలుకుతున్న పేరు. -నేను 'సొంబరా' నుంచి 'రాబర్ట్ విల్సన్' గా ఎలా రూపాంతరం చెందేనో లీలగా గుర్తొస్తోంది నాకు. -ఆ రోజు నాన్న నన్ను హాస్టల్లో చేర్పించడానికి వచ్చిన రోజు. అప్పటికే వేరే స్కూల్లో నాలుగు చదివి మానేసిన నాకు సీటివ్వడం కుదరదన్నారు. మాష్టారు. ఆ స్కూలు నుండి టీ.సీ. తెస్తే గానీ చేర్పించడం వీలవదని అంటూనే ఒక మార్గం చెప్పేరు. అక్కడ వున్న పేరు కాకుండా వేరే పేరున ఇక్కడ చేరడం. అప్లికేషన్ నింపుతూ మాష్టారికి నచ్చిన సినిమా హీరోల పేర్లు చెప్తూ వచ్చారు... నాన్న దేనికి తల వూపుతాడోనని.“అవేవీ ఒద్దండీ... రాబర్ట్ విల్సన్ అని రాయండి? కొత్త గొంతు వినపడింది. అతని వైపు చూసేను. తెల్లబట్టలేసుకొని, చేతిలో నల్లటి పుస్తకంతో వున్నాడతను. మెడలో సిలువ వేలాడుతో.. అతను తరచూ వూరు రావడం, ఇంటికి దగ్గరవడం నాకు గుర్తుకొచ్చింది అప్పుడు. "ఇదేటి వోయ్! ఇలగుందీ పేరు?” అని నాన్నని అడిగారు మాష్టారు ఆశ్చర్యంతో. నాన్న నేల చూపులు చూస్తున్నాడు.“మీము మతము తీసుకున్నాము” అని నాన్న అమాయకంగా అనడం నాకింకా గుర్తే .మతమూ... తీసుకోవడమూ!? తీసుకోవడానికి ఎవరిస్తారు? ఎందుకిస్తారు? అసలు ఇవ్వడమేమిటి? మతమంటే ఏమిటి? మా వూరికి మతమెలా వొచ్చింది? మరి అప్పుడు మా వూరెలా వుండేది?బద్దలైన అద్దం పెంకుల్లో నా ప్రతిబింబంలా... పగిలిన నా గుండె లోతుల్లోంచి వెల్లువెత్తుతున్న హృదయ ఘోషలా...ప్రశ్నలు... సందేహాలు....తాతల నాటి ముచ్చట్లలో మా వూరిని చూసేను. ఇప్పుడు ప్రధాన రహదారికి నాలుగు కొండల అవతల, అడివికి ఆమడ దూరంలో, చుట్టూ పొలాలతో మూడే మూడు వాసల్లో వుండేది వూరు. భూములున్న వాళ్లు పొలాల్లోనూ, లేనివాళ్లు కొండల మీద పోడు వ్యవసాయం చేసే వాళ్లు. అడవిలొ చింత పండూ, చీపుర్లూ, పనస పళ్లు, ఇప్పమొగ్గలూ సంతలో అమ్ముకుని జీవనం సాగించే వాళ్ళు. అంతా వర్షాధారమే. వాన కురిస్తే తిండి, లేదంటే పస్తులు. వాన కురిపించేది అడివి తల్లి, అందుకు సాక్షులు పూర్వీకులే అని నమ్మకం. చనిపోయిన వాళ్లు చల్లగా చూస్తే అడివి తల్లి కరుణించినట్లే.. లేదంటే కరువు. పెద్దల్ని ప్రసన్నం చేసుకుని చినుకుల ఆశీర్వాదం పొందడమే పండుగ.పండుగంటే... గూడెంలోని అందరి గుండె చప్పుళ్లనూ డప్పులు చేసి అడవికి వినిపించడం.పండుగంటే... కొండమీద పండిన ప్రతి గింజా మీ చలవేనని పిన్ల కర్ర పాటలు పాడడం.నీ నీడలో ఒక్కటై వున్నామని అడివి తల్లి ముందు గజ్జె కట్టి థింసా అడుగులు వేయడం... అడవికి దండం పెట్టడం.అంతే. అడవే దేవత. పోయిన పెద్దాళ్లే దేవుళ్లు. దేవుళ్ల కనుసన్నల్లో దేవత ఒడిలో బతకడమే మతం. .మరి ఇప్పుడు? మా వూరెలా వుంది??అనడానికి ఆదివాసీ గ్రామం గానీ అన్ని ఆధునిక సదుపాయాలు అందుకుంది. టి.వీ, సెల్ పోన్, ఫ్రిజ్, మోటారు బైక్. ఈ వస్తువుల కంటే ముందు... వస్తువుల్ని మోసుకొచ్చిన రోడ్డు కంటే ముందు మా వూరికి ఒక సిమెంట్ కట్టడం వొచ్చింది. అది బడి కాదు... పంచాయితీ భవనమూ కాదు... చర్చి! -అత్యంత వైభవంగా... ఆధునిక హంగులతో... ఆకుపచ్చని అడవిలో రంగురంగుల కట్టడం. దాని చుట్టూ పూరి గుడిసెల్లో మోకాలిపై మేము..చలిచలి గాలుల్లో తుడుము డప్పుల హోరు.చలి మంటల్నీ, మంచం క్రింది కుంపట్లనీ వదిలి వూరు వూరంతా వీధుల్లో ప్రవాహమైపోతున్న రాత్రి... యువతీ యువకుల థింసా అడుగుల సవ్వడీ....ఇవేవీ నన్ను నిలువనీయడం లేదు. నా కాళ్ల సంకెళ్లు తెంచుకుని నాన్న కు తెలీకుండా పాత వూరి వైపు అడుగులేసేను.అక్కడ...మేము వదిలేసిన ఇల్లు... ఆ సందడిలో ఎంతో దిగులుతో కనిపించింది. నా కోసం ఎన్నో కలలు గన్న తాత కనిపించేడు. తాత నడిచిన అడుగులు కనిపించేయి. జీవం తొణికిసలాడే వూరు కనిపించింది. సందడితో వున్న సమూహం కనిపించింది.అలాంటి వూరు నుంచి ఎందుకు వేరయ్యేము?---------------------------------------------తాత చనిపోయిన తర్వాత ఊరి పెద్దమనుషుల్లో ఒక నాన్న వ్యవసాయం తో పాటు వ్యాపారం కూడా చేసేవాడు. మా రోడ్డుకు మరీ దూరంగా, కొండల మధ్య వుండడంతో ఏ షావుకారీ వచ్చేవాడు కాదు. అందుకని నాన్న సంతలోని కొన్ని వస్తువుల్ని కొని వూర్లో అమ్మేవాడు. డబ్బు కోసం కాకుండా వూరి అవసరాల కోసం వ్యాపారం చేసే వాడు. ఇప్పమొగ్గలు, కందులు, చింతపండు, చీపుర్లు... ఏవైనా వస్తు మార్పిడి చేసే వాడు. అప్పట్లో ఐదు చదివి మానేసిన నాన్నని హాస్టల్లో కుక్కు ఉద్యోగం ఇస్తామని పిలిచిందట ఐటీడీఎ. తీరా అక్కడికెళ్లాక హాస్టల్లో అందరూ తినగా మిగిలిన ఎంగిలి మెతుకులు తప్ప జీతమొచ్చే ఉద్యోగం కాదని తెలిసి మానేసాడు. అప్పటి నుండి నాన్నకి ఆ ఆఫీసంటే రోత పుట్టింది. ఆ తర్వాత రోజుల్లో ఊర్లో వాళ్లు ఏదో సాయం అందుతుందని ప్రతి సోమవారం గ్రీవెన్స్ కి వెళ్లి వస్తున్నా నాన్న మాత్రం ఎప్పుడూ ఆ మెట్లెక్కలేదు. అతని మనసులో 'అది మా కోసం కాదు' అని ముద్ర పడిపోయిందేమో! -సరిగ్గా అలాంటి సమయంలోనే తెల్లదుస్తుల్లో వున్న వ్యక్తి వూర్లోకి అడుగు పెట్టేడు. ఆ తర్వాత్తర్వాత తెలిసొచ్చింది. అతని ద్వారానే మా వూర్లో మతం నడిచొచ్చిందని. తరచూ ఇంటికొస్తూ వుండే వాడు. నాన్నతో సన్నిహితంగా వుండేవాడు. అతనే నాన్న వ్యాపారాభివృద్ధికి ధనసాయం చేసాడని ఆ తర్వాత తెలిసొచ్చింది. ఎవరికైనా ఒంట్లో బాగోలేక పోతే వాక్యం చదివి ప్రార్ధన చేసేవాడు. ఒక్కోసారి మాత్రలని కూడా ఇచ్చేవాడు. మాత్రలతో తగ్గిన జ్వరాన్ని ప్రార్ధనతో తగ్గినదిగా చెప్పేవాడు.క్రమక్రమంగా వూర్లోని కొంతమందితో సంఘం స్థాపించాడు. వాళ్లంతా ఒక్కచోట చేరి బైబిల్ చదివి ప్రార్థన చేసే స్థాయికి తీసుకొచ్చేడు.ఓ రోజు....ప్రార్ధన ముగించి కళ్లు తెరిచేసరికి నాన్న చేతిలో వందల నోట్లు కొన్ని మెరుస్తూ కనిపించేయి. ఎదురుగా అతను. 'ఎందుకు?” అన్నట్లు అడిగాడు నాన్న. “ఇక నుంచి వూరి ప్రజల బాధల్ని ప్రభువుకి నువ్వే వినిపించాలి. ముందుండి అందరినీ దేవుని సన్నిధికి చేర్చాలి. అందరికోసం ప్రార్ధన చేయాలి.” అని ముగించేడు.ఆ కొద్ది రోజులకే నాన్న లాంటి వారందరికీ ట్రైనింగు కోసం పంపించేరు. ప్రతిరోజూ విధిగా ప్రార్ధన చేయాలి. ఆడవాళ్లు బొట్టు పెట్టుకోకూడదు. కొత్త వాళ్లెవరైనా వస్తే షేక్ హేండ్ తీసుకోవాలి. సారా మానేయాలి. తుడుం కొట్టకూడదు. డప్పు ముట్టకూడదు. ఇలాంటి కొత్త నిబంధనలెన్నో వూర్లోకొచ్చేయి. ప్రతి నెలా క్రమం తప్పకుండా జీతం వొచ్చేది నాన్నకి. వాటితో పాటు సవర భాషలో పాడిన క్రీస్తు గీతాల సీడీలు, బైబిళ్లు, రంగురంగుల కేలండర్లూ తో పాటు విలువైన కానుకలు ఎక్కడి నుండో వచ్చేవి.తమ భాష ఆధునిక సంగీత పరికరాలతో అందంగా వినబడుతుంటే ఎవరికి ఆనందంగా వుండదు? ప్రార్ధన కొచ్చిన వాళ్లు పండిన పంటలో తొలికాయ, తొలిగింజ ప్రభువుకి చేరాలనడంతో అందరూ ఏదో ఒకటి తెచ్చిచ్చేవాళ్లు. దాంతో నాన్న మరింత ఉత్సాహంగా పని చేసేవాడు.“అయితే... తాత ముత్తాతల కాసి నడుస్తున్న సంప్రతీకము ఎలాగ మానెస్తామూ?” అని వెనకడుగేసిన ముసిలోళ్లూ లేకపోలేదు.వాటన్నిటికీ సమాధానం చెప్పింది సంఘం. -“ఇన్నాళూ చెట్టుకీ పుట్టకీ మొక్కి మీరేమిటి సాధించేరు? అది మూర్ఖంతోనూ, అనాగరికంతోనూ కూడుకున్నది. ఎంత కాలమని మారకుంట వుంటారు? మనం అభివృద్ధిలోకి మారాలంటే ప్రభువుని నమ్ముకోవాల్సిందే”నని మరొక తీర్మానం కూడ చేసేరారోజు. మతం తీసుకున్నవాళ్లంతా వేరుగా ఒక కొత్త వూరుగా...

Episode metadata supplied by the publisher feed · Published Nov 27, 2020

Embed this episode

NOW PLAYING

'నా పేరు సొంబరా ' - మల్లిపురం జగదీష్ గారు

0:00 26:17

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Harshaneeyam?

This episode is 26 minutes long.

When was this Harshaneeyam episode published?

This episode was published on November 27, 2020.

Can I download this Harshaneeyam episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!