Part ii - 'జాన్ పాల్ చేసిన బీరువా కథ' episode artwork

EPISODE · Mar 20, 2021 · 15 MIN

Part ii - 'జాన్ పాల్ చేసిన బీరువా కథ'

from Harshaneeyam

ఈ'జాన్ పాల్ చేసిన బీరువా కథ', తన తండ్రి మరణం ద్వారా జీవితంలో ఏర్పడిన వెలితిని పూడ్చుకోడానికి ప్రయత్నిస్తున్న ఒక గృహిణి గురించి. ఆమెకు సాంత్వన,ఎవరి వల్ల, ఎలా లభించింది అనేదే ఈ కథ. . వసుంధరాదేవి గారు రాసిన కథల్లో అత్యంత ప్రాచుర్యం పొందింది. ఈ కథను అరసం వారు ప్రచురించిన 'ఆర్.వసుంధరాదేవి కథలు' అనే పుస్తకంలో చదవొచ్చు.ఈ పుస్తకం కొనాలంటే - https://www.anandbooks.com/R-Vasundhara-Devi“టేపులో నీ పాట తీసేసి కొత్త పాట, జానీ మేరా నామ్ లోది. మంచిది పెట్టేశాడు. అన్న..." పాప చెప్పింది.గబగబా ముందు హాల్లోకి వెళ్ళాను. రేడియోలో వస్తున్న పాటని చాలా శ్రద్దగా టేప్ రికార్డర్‌లో రికార్డు చేసుకుంటున్నాడు బాబు.“ఎందుకని నా పాట తీసేశావ్?" అనడిగాను. "ఇష్" అన్నాడు నావేపు చూడకుండానే.రికార్డింగ్ అయ్యాక "మంచిపాట నాశనం చేసేశావమ్మా, రికార్డు చేసుకుంటున్నప్పుడు మాట్లాడేశావ్" అన్నాడు.నాపాట పోగొట్టి ఇంకా పైగాను! “అది పాతపాట. ఎవరిగ్గావాలి?" అన్నాడు.“నాకు కావాలి. అందుకేగదా రికార్డు చేసుకున్నాను. అది తియ్యొద్దని చెప్పానుకదా!" అన్నాను."అమ్మా అది రికార్డు చేసి సంవత్సరం అయింది. ఒక్కనాడు కూడా నీయంతట నీవు దాన్ని పెట్టుకొని వినలేదు. అది టేపులోవుంటే నీకేం, లేకుంటే నీకేం?... మంచిపాట వస్తున్నది. తొందరలో దాని మీద పెట్టేశాను" అన్నాడు. అంతటితో ఆ సంభాషణ అయిపోయిందని తాను కొత్తగా పెట్టుకున్న పాటలు వింటూ కూర్చున్నాడు.ఆ పాట పోయింది. ఇహరాదు. వాదించి లాభమేమిటి?నా పాట పోయినందుకు నాలో నిరాశ, ఎదో విలువైనది పోగొట్టుకున్నానన్న బాధ. ఆ పాట ఉన్నా నేను పెట్టుకోను. ఎప్పుడైనా ఎవరైనా వరుసలో పెడితే వినడమే. అది ఎవరికీ అక్కర్లేని పాతపాట. నాకు కావలసిన పాట. కావలసినదైనా నేను పెట్టుకోని పాట. అది ఆ టేపులోవుంటే నాకేదో తృప్తి. ఇప్పుడు అది పోయినందుకు బాధ.ఎందుకో ఆ పాట నాకు కావాలి. నాకు ఇష్టమైందని కాదు. కాని నాకు కావలిసింది. ఎందుకో అర్థం కాకపోయినా నాకు చాలా ముఖ్యమైనది.'ఆడేపాడే పసివాడ.... అది ఏ సినిమాలోదో, ఎవరు పాడినదో, దానిలో భావమేమిటో నాకు గుర్తులేదు. నాకు అక్కర్లేదు. ఆ పాట వింటూంటే నాలో, సంచలనం రేగుతుంది. ఉధృతంగా ఎగిరిపడుతున్న అలలతో, తుఫానునాటి సముద్రంలాగా అయిపోతుంది మనసు.....ఎంతో ఆశించినదాన్ని పొందలేక విషాదభరితమైన జీవితం కల ఒక అమ్మాయి. ఆనందానికి ప్రతిరూపంగా కనిపించిన పసివాణ్ణి చూచి, ఎంతో ఆనందంతో పాడుతుంది. ఆ పాట. పాట అయిపోయేసరికి పిల్లవాడు దుర్మరణం పాలౌతాడు. మళ్ళీ కటిక చీకటిలాంటి విషాదం ఆవరిస్తుంది...ఆనందానికి విషాదానికీ గల సరిహద్దులో, రెండూ ఒకటయ్యేచోట ఆ పాట. పాట వింటూంటే ఆనందమూ, దాని వెనుకనే పొంచివున్న విషాదమూ రెండూ ఒక్కసారిగా తీవ్రమౌతాయి. ఊపిరి సలుపనివ్వకుండా పెరిగి పెరిగి... ఉక్కిరిబిక్కిరై నలిగిపోతుంది. గుండె.ఆ పాత పాట నాకు యిష్టమని కాదు. నేను నా అంతట ఎప్పుడూ దాన్ని పెట్టుకోను. కాని నాలోనే అందరాని లోతుల్లో ఉండే సత్యానికి ప్రతినిధిగా అది అక్కడ ఉండటం చాలా ముఖ్యం....మనిషి మనసు చిత్రమైనది. ఆ పాట అక్కడ ఉన్నన్నాళ్ళూ నేను దాని గురించి తలచలేదు. కాని అది చెరిగిపోయేసరికి దాని గురించి యింతగా ఆలోచించుకున్నాను. అది మాటల్లేని మూగరాగమై నాలో నిలిచిపోయింది....ఇంట్లో ఇంకో బీరువా ఉంటే నాకు ముఖ్యమైనవి పిల్లల చేతుల్లో పడకుండా భద్రంగా దాచుకోవచ్చును. కావలసినవి జారిపోకుండా, మాసిపోకుండా, చెరిగిపోకుండా, పోకుండా దాచుకోగలను.ఈ యింట్లో నాకు ఓ బీరువా చాలా అవసరం!*********************'జాన్‌పాల్ బలే టక్కరివాడమ్మా"మా యింట్లో పనులు చేసి వెళ్తుండే పనివాళ్లు ముగ్గురూ ఒక్కరకంగానే చెప్పారు, జాన్ గురించి. ఆ విషయం నాకూ కొంచెం అనుభవమే. కాని 'తెలియని దేవతకన్నా తెలిసిన దయ్యం మేలు' అన్న సామెత ననుసరించి నడుస్తుంది నా బుద్ధి.బీరువాను రెడీమేడ్ గా కొనాలంటే పాతిక మైళ్ళవతల ఉన్న పట్నం వెళ్లి కావలసిన సైజులో ఆర్డరిచ్చి రావాలి. షాపువాళ్లు యిప్పుడిస్తాం, అప్పుడిస్తాం అంటుంటే అక్కడకు నాలుగుసార్లు వెళ్ళాలి. తర్వాత జాగ్రత్తగా పాక్ చేయించి దెబ్బ తగలకుండా బస్సుమీదనో లారీ మీదనో తీసుకురావాలి. ఇంతా చేశాక వాళ్లు రెండోరకం కొయ్యవేసిన చక్కగా పాలిష్ చేసి, ఘనంగా వార్నిష్ చేసి మసిపూసి చేసిన మారేడుకాయలాంటిది అంటగడితే ఎలాగా? చెక్క క్వాలిటీ మనం సరిగా కనుక్కోగలమా?అద్దంలా మెరిసే అందమైన బీరువా కావాలి. కాని దానికోసం ఎక్కువ యాతన పడడానికి ఓపికలేదు.అటువంటి సమయంలో జ్ఞాపకం వచ్చాడు జాన్‌పాల్.ఇదివరలో ఒకసారి పుస్తకాల షెల్పులు తయారు చెయ్యడానికి ఒచ్చినప్పుడు ఎన్నాళ్ళ బట్టో మా యింట్లో వుంటున్న బుక్ కేస్ను చూసి “ఇది. ఇంగ్లండులో దొరికే, పియానోలు చేసే వాల్నట్ కొయ్యతో చేసింది...అమ్మో! ఇదిక్కడ దొరికేదిగాదు...అమ్మా, ఇది ఫారిన్ చెక్క!' అన్నాడు. ఆ మాటలంటుంటే జాన్ మొహంలో కనిపించిన గాంభీర్యాన్ని, గౌరవభావాన్ని చూచి ఆ బుక్కేస్ గొప్పదనాన్ని ఊహించుకున్నాను. అల్లాగే ఒక పాత. బీరువాను చూడగానే 'ఇది బర్మాటేకులో ఒకటోరకం' అని చెబుతూ టేకుల్లో ఎన్నిరకాలో, వాటి చరిత్రలగురించి ఒక ఉపన్యాసంలాంటిది ఇచ్చాడు. కొయ్యల్లో ఇన్ని రకాలున్నాయని నాకు ఇది వరకు తెలియదు. జాన్ మీద చాలా గౌరవం కలిగింది నాకు. అద్దంలో మెరిసే అందమైన బీరువాను ఒకటోరకం టేకుతో తయారు చెయ్యగల సామర్థ్యం జాన్ కు ఉన్నది అనుకున్నాను.కాని ఈ జాన్ తో ఇతరవిధాలైన చిక్కులు వస్తాయి. ఇదివరలో బుక్ రాక్లు చేసినప్పుడు పట్నంవెళ్ళి సామాన్లు తెస్తానని కొయ్యలు మేకులూ అంటూ, రెట్టింపుధరలు వేసిన దొంగబిల్లులు తెచ్చి డబ్బు తీసుకున్నాడు. అవి ఫ్లయివుడ్ షీట్లు కనుక, వాటి ధరలు వేరుగా కనుక్కోగా, మోసం బయటపడింది. జాన్ అప్పటికే డబ్బు తీసుకున్నాడు. మళ్లీ పిలిపించి అడిగాము. కొట్లవాళ్ళ మోసాలను గురించి చిన్న ఉపన్యాసం చాలా 'ఇన్ఫర్మేటివ్'గా ఉండేది. ఒకటి ఇచ్చాడు. వడ్రంగిపనికి సంబంధించిన ఏ విషయం మీద మాట్లాడవలసి వచ్చినా ఇటువంటి మంచి ఉపన్యాసాలు ఇస్తాడు. అవి విన్న తర్వాత జాన్ మీదా, వడ్రంగి పనిమీదా కలిగిన గౌరవభావంతో నోరు మెదపలేము.పల్లెటూళ్ళలో ఏ పని జరగాలన్నా ఒక భగీరథ ప్రయత్నం కావాలి. ఒక ఇల్లు కట్టించుకోవాలంటే బేలుదారీలు, వడ్రంగులు, పెయింట్లు వేసే వాళ్ళు అంటూ అన్ని రకాలైన పనివాళ్ళకీ పనులు జరుగుతున్నంతకాలమూ ఇంట్లోనే భోజనాలు పెట్టాలి. కరెంటు వేయించుకోవాలంటే వైరింగు చేసేవాళ్లకూ అంతే. ఏదైనా వస్తువు చేయించాలంటే వడ్రంగులకూ అంతే. ఆఖరుకు బట్టలు కుట్టే టైలర్లకు కూడా అంతే. వాళ్ళ భోజనాలకు గడిచిపోగా, పనిచేసినన్ని రోజులకు కూలిడబ్బులు చేతబట్టుకొని ఇళ్ళకు వెళ్తారు. వాళ్ళు పనిని సాగదీసి, ఇంకో వారం రోజులు గడిపే తత్వంలో వుంటారు. .. మన పనిచేసే వాళ్ళు మనింట్లో భోజనం చెయ్యడం, తృప్తిగా పనిచెయ్యడం న్యాయమే కావచ్చును. కాని ఏ పని జరగాలన్నా ఇంత ప్రయత్నం కావలిసి రావడం పట్నాలనుండి వచ్చినవాళ్ళకు విసుగ్గా ఉంటుంది. డబ్బు పారేస్తే పని జరగటం, వస్తువు ఇంటికి రావడం అన్న పద్ధతికాదు ఇక్కడ. ఇది ఒక పాతపద్ధతి. వస్తువుకి, అది చేసే వారి మంచి చెడ్డలకీ గల అవినాభావ సంబంధాన్ని గుర్తించితీరాలి..మా వారు ఇక్కడ కొత్తగా పెట్టిన చక్కెరమిల్లులో అసిస్టెంట్ మేనేజర్‌గా చేరారు. అందువలన ఈ పల్లెటూరికి వొచ్చాం మేము. ఊళ్ళో మరో ముగ్గురు వడ్రంగులు ఉన్నారు. కాని అందరిలోకీ జాన్ కి పని బాగా చేతనవునని...జాన్, ఇతరులు కూడా చెపుతూవుంటారు. మిల్లులో ఏవైనా కొయ్యపనులు జరగాల్సినప్పుడు జాన్ ని పిలుస్తారు. ఇది ఒకరకంగా జాన్ కి సహాయం చెయ్యడమే. ఆ సంబంధంవలన ఇదివరలో ఒకసారి వచ్చి బుక్ రాక్స్ చేశాడు."అమ్మో, అయ్యగారింట్లో భోజనం పెట్టమని నేనడుగుతానా! వూళ్ళో నాకు ఇల్లుంది. వంట చేసుకుంటాను... కూలి కూడా అయ్యగారి దగ్గర ఒక్క రూపాయి తక్కువే తీసుకుంటాను" అన్నాడు జాన్. పెద్దాచిన్నా బాగా ఎరిగినవాడు. పెద్దవాళ్ళ దగ్గర వినయంగా ఉండటం నేర్చినవాడు. కొయ్యలూ వగైరాలు తేవడంలోనూ, కూలిలోనూ కూడా. ఎక్కు వ డబ్బు తీసుకున్నాడంటే అది వేరే మాట. వాళ్ళూ బతకాలిగద...అన్ని విషయాలూ ఆలోచించిన మీదట జాన్ కు కబురుపెట్టాను. మిల్లులో పనులు చేస్తూనే ఉంటాడు అడపాదడపా. కనుక మనల్ని చిక్కున పెట్టడు లెమ్మనుకున్నాను.పొట్టిగా దిట్టంగా చామననలుపులో ఉంటాడు జాన్. అరవై దగ్గరగా వయస్సయినా నలభైకి మించినట్లు కనబడడు. మొహం, ఎదురురొమ్మూ , చేతులూ, కాళ్ళూ అన్నీ వేటికవి బలంగా ధృడంగా కనిపిస్తాయి. పై వరుసలో ముందుపళ్ళు రెండు లేవుగాని మిగతా పళ్ళు రాళ్ళ మాదిరి గట్టిగా ఉన్నాయి. ఎత్తయిన నుదుటి క్రింద లోతుల్లో కనిపించే కళ్లు నల్లగా ఉండి ఎప్పుడూ చురుగ్గా చూస్తుంటాయి. రూపం, మాటతీరుఅన్ని ప్రత్యేకంగా ఉండటాన జాన్ని ఒకసారి చూస్తే ఎవరూ మరచిపోలేరు. జాన్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే...బలశాలి. మాటలో, చేతలో, చూపులో | అన్నిట్లోనూ బలం. అదీ జాన్ అంటే!నిజం చెప్పాలంటే జానన్ను చూస్తే కొద్దిగా భయం నాకు. దుర్బలులకు శక్తిని చూసినప్పుడు కలిగే భయం. స్థూలంగా చూస్తే దానికి వేరే కారణం లేదు మరి! చకచకా లెక్కలు వేశాడు జాన్. అంతా ఒక వందరూపాయలకు సామాను తెస్తే టేకు బీరువా యీ సైజుది తయారు చెయ్యొచ్చునట. పట్నంలో షాపునుంచీ ప్లైవుడ్ బీరువా యీ సైజుది నాలుగువందలకు తెచ్చారు. పక్కింటివాళ్ళు. అట్లాగని జాన్ తో నేను అనలేదు. 'రోజ్ వుడ్ అయితే ఎక్కువ ఖరీదవుతుందా?” అనడిగాను. “లేదు. రెండూ ఒకటే” నన్నాడు. “తక్కువరకం సరుకు తెస్తాడేమో, లేకుంటే ఇంత చవగ్గా ఎలా వస్తుందీ” అనుకున్నాను. “మంచిరకం టేకు తేవాల”న్నాను. 'అయ్యగారికి ఎట్లాంటివి తేవాలో నాకు తెలియదా? అంటూ తాను పట్నంలో పెద్ద పెద్ద ఆఫీసర్లకు ఎన్నెన్ని వస్తువులు చేసింది, వాటిని చూచి వాళ్ళు ఎంతెంత ఆశ్చర్యపడిందీ, మెచ్చుకున్నదీ అంతా చెప్పాడు.జాన్ క్రిష్టియన్ మిషనరీల దగ్గర పెరిగాడు. పని నేర్చుకున్నాడు. ఒక ఇంగ్లీష్ దొరగారు...పీటర్స్ దొరగారు..దయతో అన్ని పనులు నేర్పించారు. జాన్కు ఎంతో సహాయం చేశారు. ఆయన దయవల్ల ఎట్లాంటి వస్తువైనా చెయ్యగల నేర్పు అబ్బింది జాన్ కు . “ఒరే, ముండాకొడకా, సరిగ్గా చెయ్యకపోతే తంతాను” అన్నాట్ట కలెక్టరుగారు. ధైర్యంగా చేస్తానన్నాడు జాన్. పెద్దవాళ్ళను మెప్పించాలని జాన్ పట్టుదల. రోల్ టాప్ డెస్క్ చెయ్యాలి. ఆ పట్నంలో ఎవరికీ చేతగాని పని అది. అలాటిదాన్ని ఇదివరలో పీటర్ దొరగారి దగ్గర చూచివున్నాడు జాన్. అందుకే ధైర్యం చేసి ఒప్పుకున్నాడు. చేశాడు. కలెక్టరుగారు 'సెభాష్' అన్నారు.ఇంకోసారి ఒక పెద్ద డాక్టరుగారికి అసుపత్రిలో ఉపయోగించే ఒక వస్తువు చేయించవలసిన పనిబడింది. ఆ వస్తువును పై దేశాల్నుంచీ తెప్పించాలంటే చాలా ఆలస్యమూ, ఖర్చూను. అందువలన జాన్ను పిలిపించి చెప్పారు. జాన్ ఆలోచన చేశాడు. ఒకరకంగా ఊహించుకున్నాడు. దాన్ని చేశాడు. తప్పు అయింది. పారేశాడు. మళ్లీ చేశాడు. డాక్టరుగారు సరిగ్గానే ఉందన్నారు. ఇహ ఒక అద్దం బిగించాలి దానికి. అది ఎట్లా బిగించాలో చెప్పారు డాక్టరుగారు. కాని తాను దగ్గర ఉన్నప్పుడే బిగించాలనీ తొందరగా వొస్తానని చెప్పి వెళ్లారు. ఎంత సేపు చూచినా ఆయన రాలేదు. పని పూర్తి చేసుకుని డబ్బు తీసుకుని వెళ్ళాలని జాన్ ఆదుర్దా. డాక్టరుగారు చెప్పిన ప్రకారంగానే ఆయన రాకుండానే బిగించేశాడు. డాక్టరుగారు ఇంటికొచ్చారు. పనయిపోయింది, డబ్బులివ్వమని చెప్పుకున్నాడు జాన్. డాక్టరుగారికి కోపం మండిపోయింది. “నిన్నెవరు బిగించమన్నారురా రాస్కెల్! నేను రాకుండా బిగించవద్దనలేదా?' అంటూ చెయ్యిచాచి మొహం మీదకొట్టారు”ముందుపళ్ళు రెండూ రాలిపడ్డాయి. జాన్ బయటికెళ్ళి రక్తం వూసివచ్చాడు. డాక్టరుగారు వస్తువు చూసుకున్నారు. సరిగ్గానే చేశాడు. జాన్. డబ్బులిచ్చి పంపేశారు. ఇప్పుడా...

Episode metadata supplied by the publisher feed · Published Mar 20, 2021

Embed this episode

NOW PLAYING

Part ii - 'జాన్ పాల్ చేసిన బీరువా కథ'

0:00 15:55

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Harshaneeyam?

This episode is 15 minutes long.

When was this Harshaneeyam episode published?

This episode was published on March 20, 2021.

Can I download this Harshaneeyam episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!