ప్రసాదం :  కథా మూలం - ప్రసిద్ధ తమిళ రచయిత సుందర రామస్వామి గారు episode artwork

EPISODE · Mar 26, 2023 · 38 MIN

ప్రసాదం : కథా మూలం - ప్రసిద్ధ తమిళ రచయిత సుందర రామస్వామి గారు

from Harshaneeyam

ప్రసాదం - ఈ కథకు మూలం ప్రసిద్ధ తమిళ రచయిత సుందర రామస్వామి గారు. కథలోకి వెళ్లబోయే ముందు ఒక చిన్న గమనిక - హర్షణీయం స్పాటిఫై ఆప్ ద్వారా వినే శ్రోతలు  ఇప్పుడు కథపై తమ   అభిప్రాయాన్ని తెలియచేసే అవకాశం వుంది. మీ అభిప్రాయాలు వెంటనే ఆప్ ద్వారా ప్రచురితం అవుతాయి. స్పాటిఫై ద్వారా హర్షణీయం ను వినడానికి, కొత్తగా వచ్చే ఎపిసోడ్స్ ని వెంటనే ఉచితంగా డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ ఇచ్చిన లింక్ ని వాడి , ఆప్ లోని ఫాలో బటన్ ని నొక్కండి. https://bit.ly/harshspot**************ప్రసాదం (1958): తమిళ మూలం - సుందర రామస్వామి గారు‘సెవెంటీ త్రీ ఫోర్టీ సెవెన్ ’, డ్యూటీ ఎక్కినప్పట్నుంచీ, ఒక్క రోడ్డూ వదిలిపెట్టకుండా, బీటు కొడుతూనే వున్నాడు. ఎలాగైనాసరే డ్యూటీ అయిపోయే లోగా ఐదు రూపాయలు సంపాయించాలి. అప్పుడే తలెత్తుకుని ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అది జరిగితేనే పొన్నమ్మ మొహంలో మొహం పెట్టి చూడగలడు. ఆ మొహంలో నవ్వు చూడగలడు. అన్నిటికీ మించి, పిల్ల పుట్టినరోజు, ఏ ఇబ్బందీ లేకుండా జరిగిపోతుంది. అతను తిరిగి తిరిగి,మళ్ళీ నాలుగు రోడ్ల కూడలి దగ్గరి కొచ్చాడు. గత పది నిమిషాల నుంచీ, ఓ జంట మెయిన్ రోడ్డు అంచున నిలబడి, అటూ ఇటూ చూస్తూ, రోడ్డు దాటడానికి కాచుకొని వున్నారు. అమ్మాయి చంకలో ఓ చిన్న పాప వుంది. వాళ్ళు గుడికెళ్ళి వస్తున్నారని అర్థమైపోతోంది. ‘ఇలానే రేపు గుడికి, నాతో కల్సి వెడదామని పొన్నమ్మ గూడా ఎదురు చూస్తూ ఉంటుంది’ అనుకున్నాడతను. ‘పిల్ల పుట్టినరోజు సంబరం గురించి ఎంత గొప్పగా, వూహించుకుంటోంది?’ ఆ సాయంత్రం ఆమె చెప్పిందంతా, పొల్లు పోకుండా గుర్తుకు తెచ్చుకున్నాడు. ఆమె కోరిక కొంచెం విచిత్రంగా వుంది. పిల్లనెత్తుకుని, వీధిలో, ఏ విధంగా నడవాలనేది, ఆమె వర్ణించి వివరించింది. ‘నేను రేపు తెల్లవారుఝామున లేచి చంటిదానికి వేణ్ణీళ్ళ స్నానం చేయిస్తాను. పట్టు పావడా వేసి, జడకుచ్చులు పెడతాను. ఒక్క గులాబీ పువ్వు.. జళ్ళో ఒకటే గులాబీ పువ్వు పెడితే, ఎంత బావుంటుంది? మనం చంటి దాన్ని తీసుకుని, పొద్దున్నే వీధిలో గుడికి నడిచెడుతూంటే, అందరూ మనల్నే చూడాలి… ఇంటిముందు కళ్ళాపి చల్లే వాళ్ళు, ముగ్గులు పెట్టే వాళ్ళు…. ఒకరి తర్వాత ఒకరు, అందరూ తలెత్తి మనల్నే చూడాలి. అలా అందరూ తలెత్తి మనవైపు చూడడాన్ని, నేను చూసి, నీ వైపు తిరిగి నేను నిన్ను చూడాలి. నువ్వు గూడా, వాళ్ళు తలెత్తి మనల్ని చూడ్డం చూసి, నా వైపుకు తిరిగి నన్ను చూడాలి.’‘సెవెంటీ త్రీ ఫోర్టీ సెవెన్’, తానెక్కడున్నాడో మర్చిపోయి, ఒక్కసారి గట్టిగా బయటకి పగలబడి నవ్వాడు. తరువాత వెంటనే నోరు మూసేసాడు. ఆ జంట రోడ్డు దాటారు. పొన్నమ్మ అనుకున్నదంతా సరిగ్గా జరగాలంటే, కావల్సింది కేవలం, ఇంకో ఐదు రూపాయలు. మొత్తం పుట్టినరోజు ఖర్చు యాభై రూపాయలైనా, పొన్నమ్మ అతడినడిగింది మాత్రం ఐదు రూపాయలు. బట్టలు తానే వెళ్ళి అరువులో తెచ్చింది. రాత్రే కుట్టడానికి ఇచ్చేసింది. చీటీ పాడి, ఒక ముత్యాల హారం కొనింది. పాలమ్మి ఆ అప్పు తనే తీర్చేస్తుంది. ఆమె అడిగిన డబ్బులు, పుట్టినరోజు నాటికి కావాల్సిన, పై ఖర్చుల గురించి మాత్రమే. అది గూడా కేవలం ఐదు రూపాయలు. ఇంట్లో ఒక్క పైసా లేదు. ఒక్క నయా పైసా గూడా! అప్పటికే ఇరవై ఐదో తారీకు వచ్చేసింది.‘సెవెంటీ త్రీ ఫోర్టీ సెవెన్ ’, లాఠీతో తన బూట్లని తాటించాడు. చూడ్డానికి ఒక దిష్టిబొమ్మలాగా వుంటాడతను. ఒక సారి చూస్తే, తొందరగా మరిచిపోయే మొహం కాదు అతనిది. మొహం నిండా అమ్మవారి మచ్చలు,మందంగా వున్న కనుబొమ్మలు. రెండు కనుబొమ్మలూ కలసిపోయి వున్నాయి. చెవుల్లోంచి వెంట్రుకలు పెరిగి బయటకొచ్చాయి. ముక్కు కింద, ఈగల గుంపు తిష్ట వేసినట్టుగా ఉన్న, పొట్టి మీసం.  అతని కళ్ళు, ఆ వైపూ, ఈ వైపూ, కిందుగా ఎగురుతున్న గెద్ద నీడలా, చుట్టూ తిరుగుతూ ఆ ప్రదేశం అంతా, కలయచూసాయి. వలలో చిక్కేందుకు ఒక్క చేపా కనపడలేదు. మెడంతా చెమట పట్టి ధారలు ధారలుగా కారుతోంది. తల వేలాడేసుకుని వున్నాడు. శరీరంలోని ఆణువణువూ అలిసిపోయినట్టనిపించింది. ఇన్నేళ్ళ పోలీసు జీవితంలో, ఇంత అధ్వాన్నంగా ఏ రోజూ గడవలేదు. పొద్దున్నే లేచి ఎవడి మొహం చూసానా? అని గుర్తుకు తెచ్చుకోడానికి ప్రయత్నించాడు. లేచి,కళ్ళు తెరవంగానే, అద్దంలో తన మొహం తానే చూసుకున్నాడనే విషయం గుర్తుకొచ్చింది. నవ్వుకున్నాడు. మాట్నీ ఆట వదిలిపెట్టినట్టున్నారు, ఊళ్ళో జనాలందరూ ఉప్పెనలా వచ్చిపడ్డారా! అన్నట్టు, ఒక్కసారిగా వీధుల్ని కమ్ముకున్నారు. హడావుడి తగ్గేదాకా పక్కన నిలబడి, తర్వాత నెమ్మదిగా నడవడం మొదలుపెట్టాడు. ఈ ‘నిరవధిక కాళ్ళీడ్పుడు’ కార్యక్రమం , సాయంత్రం నాలుగుగంటలకు మొదలైంది. ఇప్పుడు ఏడు అయ్యింది. కొంతసేపైతే, ఎనిమిది కూడా దాటుతుంది. సమయం గడిచిపోతోంది. ఒక్క చేపా, చేతికి చిక్కకుండా, ఉన్న సమయం అంతా గడిచిపోతోంది. విచిత్రంగా, ఈ రోజు, లైటు లేకుండా సైకిల్ తొక్కే, ఒక్క పురుగూ తన కంటపడట్లేదు. ఎవడైనా గోడలు ఖరాబు చేస్తూ, దొరుకుతాడేమోనని, అందుకు ప్రసిద్ధి చెందిన, సందులూ, గొందులూ తెగ తిరిగాడు. ఓ మూల దాక్కుని, ఎవడైనా పోస్తూ చిక్కుతాడని, గంటలు గంటలు వేచి చూసాడు. కాళ్ళు పీకడం తప్ప ఒరిగిందేమీ లేదు. ఆఖరికి, ఒక్క పిల్లవాడు కూడా, గోడ మీద మూత్రిస్తూ కనపళ్ళేదు. ‘ఇప్పటిదాకా మామూలుగా వుండిన ఆడ, మగ అందరూ, ఇప్పుడు కట్టకలిసి, ఒక్కసారిగా బాధ్యత గల్గిన పౌరులై పోయారు. వాళ్ళందరూ వర్థిల్లాలి!’సెవెంటీ త్రీ ఫోర్టీ సెవెన్ దవడ కండరాలు బిగుసుకున్నాయి. కూడలి నించి మొదలెట్టి , ఈసారి ఉత్తరం వైపు నడవడం మొదలుపెట్టాడు. అక్కడక్కడా మధ్యలో ఆగి, మళ్ళీ నడవడం మొదలెడుతున్నాడు. నాలుగడుగులు ముందుకేయడం, ఆగడం. ఇంకొంచెం దూరం, ముందుకెళ్ళి ఆగిపోయాడు. ఆందోళన తారాస్థాయి కి చేరుకుంది. వచ్చే పొయ్యే ప్రతి టాక్సీ వైపు చెయ్యి ఝుళిపించి, ఆపుతున్నాడు. కానీ ప్రతి డ్రైవరూ లైసెన్స్ తోనే బండి నడుపుతున్నాడు. రూలు ప్రకారం ఐదుగురిని మాత్రమే ఎక్కించుక తిరగవల్సి ఉంటే, ఏ టాక్సీ లో కూడా ముగ్గురి కంటే ఎక్కువమంది కనపడ్డం లేదు. నలుగురితో తిరగగలిగిన ఆటోలో డ్రైవర్ తప్ప ఎవరూ ఉండట్లేదు. ‘శభాష్! ఈ దేశంలో ఇంక పోలీసుల అవసరం లేదు!’. ఎవరైనా కూలీని ఆపి బెదిరిద్దామంటే, ఎక్కడా ఒక్క కూలీ కూడా కనపడ్డం లేడు . ఈరోజే కొత్త సినిమా విడుదల . అందరు కూలీలు సినిమా హాల్లో దూరినట్టున్నారు. ఈ రోజుల్లో ప్రతి అడ్డగాడిదకీ ఈ సినిమాల పిచ్చి ఒకటి. చీకటి పడంగానే కూల్ డ్రింక్ షాపులో, మందు అమ్మకం మొదలౌతుంది. రూలు ప్రకారం ఇక్కడ మద్య నిషేధం పూర్తి అమలులో ఉండాలి. వెళ్ళి షాపు ముందర నిలబడితే సరిపోతుంది, మామూలు చేతిలో పెడతారు. చాలు. పుట్టిన్రోజు బ్రహ్మాండంగా జరిగిపోతుంది. కానీ షాపు మూసుంది. దేనికి మూసాడు? వీడి బామ్మ గానీ ప్రసవించిందా? వ్యాపారం చేసుకునేవాడికి ఇంత అలక్ష్యమా?మెయిన్ రోడ్డునించీ ఒక జట్కా , సందులోకి వచ్చింది. బండి తోలుతోంది, ఒక పిల్లవాడు. మీసాలు కూడా మొలవలేదింకా. ఆఖరికి వాడు కూడా, బండిలో, దీపం పెట్టుకునే తోలుతున్నాడు. బండి తన వైపే వస్తోంది. ‘ఏయ్! బండాపు!” కళ్ళెం లాగి పట్టుకుని ఆపాడు ఆ అబ్బాయి. “మీ నాన్నెక్కడ?” “ఈ రోజు డ్యూటీ ఎక్కలేదు”“ఏం?”“వొంట్లో బాలేదు”“ఏం బాలేదు?”“ కడుపు నొప్పి”“ఓ ఎనిమిదణాలు బయటకు తీ”“ఏంటి?”“ఎనిమిదణాల్రా”“ ఒట్టు సార్. అస్సలు ఒక్క పైసా లేదు నా దగ్గర”“ రేయ్ మాట్లాడకుండా డబ్బులు తీ”“ కావాలంటే చూడు సార్” బండిమీదే నిల్చుకుని, కట్టుకున్న లుంగీ విప్పి, విదిలించి మళ్ళీ కట్టుకున్నాడు వాడు. “ఎదవా! ఫో ఇక్కణ్ణించీ, దీన్నసలు జట్కా అంటార్రా, అసలు మనిషెవడైనా ఎక్కుతాడ్రా దీన్లో?”. బండి ముందుకెళ్ళి పోయింది. సెవెంటీ త్రీ ఫోర్టీ సెవెన్ పోస్ట్ ఆఫీసు వైపు నడిచాడు. కిళ్ళీ బంకు దగ్గర వేసిన బెంచీ మీద కూర్చున్నాడు. టోపీ తీసి వొళ్ళో పెట్టుకున్నాడు. జుట్టులోకి వేళ్ళు, అట్నించీ ఇటు పోనిచ్చాడు. బయటకొచ్చిన చెయ్యి పూర్తిగా తడిసిపోయుంది. పట్టలేనంత చిరాకొచ్చింది. తొడలు నొప్పిపెట్టేదాకా, చేతుల్ని నిక్కరు మీద విపరీతంగా రుద్దాడు. తూర్పు కీ పడమరకీ అటూ ఇటూ చూసాడు. ఒక భారీ ఆకారం పోస్ట్ ఆఫీసు వైపే వస్తోంది. మొహం ఎక్కడో చూసినట్టుంది. కృష్ణుడి గుళ్ళో పూజారి కదూ? ఆయన పోస్ట్ ఆఫీస్ దాకా వచ్చాడు. సెవెంటీ త్రీ ఫోర్టీ సెవెన్ అతన్నే కన్నార్పకుండా చూస్తున్నాడు. చేతుల్లో ఒక పొడవైన కవర్ వుంది. సెవెంటీ త్రీ ఫోర్టీ సెవెన్ లేచి ఆయన వెనకాలే వెళ్ళాడు. ఆ మనిషి పోస్ట్ బాక్స్ తగిలించి వున్న స్థంభం దాకా వచ్చాడు. “ఎవరదీ?” పిలిచాడు డెబ్బై మూడు నలభై ఏడు. ఉన్నపాటున వెనక్కి తిరిగి చూసాడు పూజారి. “ఇక్కడికోసారి రండి”“ఇదిగో వస్తున్నా! దీన్ని డబ్బాలో వేసి ”“ఇక్కడికి రండి ముందర. దాన్ని లోపల వెయ్యొద్దు”ఆయనక్కడే నిలబడిపోయాడు భయంతో. “రండిక్కడికి” పిలుపు అరుపుగా మారింది ఈ సారి. సందేహిస్తూ రెండడుగులు వేసాడు ఆయన. భారీ ఆకారం. బొద్దుగా వున్న శరీరం. ఒళ్ళంతా నూనె పూసుకున్నట్టు, చర్మం మెరుస్తోంది. సీమంతానికి తయారుగా వున్న ఎనిమిదోనెలంత పొట్ట. నెమ్మదిగా ముందరకొచ్చి నిలబడ్డాడు. “ ఆ చేతిలో ఏవుంది?”“కవరు”“ఎలాంటి కవరు?”“మామూలు కవరే! డబ్బాలో వేద్దామని తీసుకొచ్చాను.”“ఓ సారివ్వండి. చూడాలి”చేతిలోంచి లాక్కుని చూసాడు. ఆ కవరుతో పాటూ, పోస్ట్ కార్డు కూడా ఒకటుంది. కార్డు ఎవరో, ఎవరికో రాసింది. పొడుగు కవరు మీద మటుకు, డీ ఎస్ పీ ఆఫీస్ చిరునామా కనపడుతోంది. సెవెంటీ త్రీ ఫోర్టీ సెవెన్ పూజారి వైపే తీక్షణంగా చూసాడు. ఆయన మొహం ఎర్రబడింది. కన్నార్పకుండా, సెవెంటీ త్రీ ఫోర్టీ సెవెన్ ఆయన వైపే చూస్తున్నాడు. గుడి పూజారి మొహం ముదురు ఎరుపులోకి మారింది. సెవెంటీ త్రీ ఫోర్టీ సెవెన్ కి తీవ్రమైన అనుమానం కలిగింది. అలానే విపరీతమైన సంతోషం కూడా. తన కూతురు అదృష్టవంతురాలు, నిజంగానే…  “ఈ కవరెక్కడిది?” ఇప్పుడు గొంతులో అధికారపు దర్పం తెలుస్తోంది.పూజారి అలానే నిలబడ్డాడు, పెదాలు బిగించుకుని. తల వంచేసుకున్నాడు.  “ఎందుకు ఏవీ మాట్లాడట్లేదు? నోట్లో కజ్జికాయ కానీ పెట్టుకున్నావా?”అదే పరిస్థితి. ఏ సమాధానం బయటకు రాలేదు. “మామూలుగా మాట వినేట్టులేవు. పద స్టేషన్ కు పోదాం”“పోలీస్ స్టేషనా?” చెవుల్లో ఆ మాట పడంగానే, గుడి పూజారి ఒంట్లో సన్నటి వణుకు మొదలైంది.  సెవెంటీ త్రీ ఫోర్టీ సెవెన్, పూజారిని ఓ చిన్నతోపు తోసాడు. తడబడుతూ మాట్లాడడం మొదలుపెట్టాడు పూజారి. “దయుంచి నేను చెప్పేది వినండి. ఏ దుర్ముహూర్తాన బయలుదేరానో! లేకపోతే…”“సొల్లాపి విషయానికిరా! ముందు.”“నిజంగా ఎంత దుర్దశ పట్టకపోతే, ఈ సమయంలో, వీధి మధ్యన, ఒక బజారు రౌడీ లాగో, జేబుదొంగలాగో నిలబడిపోతాను?”“ ఛస్. అడిగిందానికి సమాధానం చెప్పు, వింటూంటే ఏదో ఒకటి చెప్తా పోతూనే వున్నావ్ !”“దేవళం పక్కన చిన్న పోస్ట్ డబ్బా వుంది. అందులో ఈ కార్డు ముక్క పడేద్దామని వెళ్ళాను.”‘అక్కడ...

NOW PLAYING

ప్రసాదం : కథా మూలం - ప్రసిద్ధ తమిళ రచయిత సుందర రామస్వామి గారు

0:00 38:46

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Harshaneeyam?

This episode is 38 minutes long.

When was this Harshaneeyam episode published?

This episode was published on March 26, 2023.

What is this episode about?

ప్రసాదం - ఈ కథకు మూలం ప్రసిద్ధ తమిళ రచయిత సుందర రామస్వామి గారు. కథలోకి వెళ్లబోయే ముందు ఒక చిన్న గమనిక - హర్షణీయం స్పాటిఫై ఆప్ ద్వారా వినే శ్రోతలు  ఇప్పుడు కథపై తమ   అభిప్రాయాన్ని తెలియచేసే అవకాశం వుంది. మీ అభిప్రాయాలు వెంటనే ఆప్ ద్వారా ప్రచురితం...

Can I download this Harshaneeyam episode?

Yes, you can download this episode by clicking the download button on the episode player, or subscribe to the podcast in your preferred podcast app for automatic downloads.
URL copied to clipboard!