EPISODE · Oct 18, 2020 · 39 MIN
శ్రీరమణ గారు - బంగారు మురుగు
from Harshaneeyam
తెలుగు వారికి శ్రీ శ్రీ రమణ గారు కథా రచయిత గా , కాలమిస్ట్ గా , సంపాదకీయులుగా అత్యంత సుపరిచితులు.బంగారు మురుగు - శ్రీ రమణ గారి రచించిన 'మిధునం ' కథా సంకలనం లోనిది.ఒక బామ్మ గారు, మనవణ్ణి తన ప్రాణానికి ప్రాణంలా ఎలా చూసుకుంది? తన తదనంతరం అదే ప్రేమను అందించడానికి, తన బంగారాన్ని, ఇంకో యోగ్యురాలైన వ్యక్తి చేతికి ఎలా అందించిందీ ? అనేదే ఈ కథలో ముఖ్యాంశం.ఇప్పటిదాకా ఆయన కేవలం ఒక పాతిక కథలు మాత్రమే రాసారు. ఈ కథ చదివిన తర్వాత, సుప్రసిద్ధ రచయిత , సాహితీ వేత్త శ్రీ ఆరుద్ర గారు ఏవన్నారంటే , " కడిమి చెట్టు పన్నెండేళ్లకోసారి పూస్తుంది. ఇదిగో ఇప్పుడు శ్రీరమణ పూశాడు. ఆ కురింజి పేరు 'బంగారు మురుగు' "హర్షణీయంలో ఈ విజయదశమి రోజున ప్రసారం అయ్యే శ్రీ శ్రీరమణ గారి ఇంటర్వ్యూలో , ఈ కథ గురించి మరిన్ని వివరాలు మనం తెల్సుకోవచ్చు.ఇంటర్వ్యూ కు , వారి కథలు/వ్యాసాలూ ఆడియో రూపంలో మీకందించటానికి అనుమతినిచ్చిన శ్రీ రమణ గారికి హర్షణీయం తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు.ఈ పుస్తకం మీరు కొనడానికి, కావాల్సిన వివరాలు ఇదే వెబ్ పేజీ లో చివర ఇవ్వబడ్డాయి.బంగారు మురుగు:నాకు ఆరేళ్ళప్పుడు మా బామ్మకి అరవై ఏళ్లు.మా అమ్మానాన్న ఎప్పుడూ పూజలూ పునస్కారాలూ, మళ్ళూ దేవుళ్ళూ గొడవల్లో వుండేవారు. స్వాములార్లు, పీఠాధిపతులూ ఎత్తే పల్లకీ, దింపే పల్లకీలతో మా ఇల్లు మరంలా వుండేది. అమ్మ తడిచీర కట్టుకుని పీఠాన్ని సేవిస్తూ - నే దగ్గరకు వెళితే దూరం దూరం తాక్కూడదు అనేది.బామ్మకి యీ గొడవలేం పట్టేవి కావు. అమ్మ నాన్న చుట్టం పక్కం అన్నీ నాకు బామ్మే. మా బామ్మకి కాశీ రామేశ్వరం అన్నీ నేనే. ఓకంచంలో తిని ఓ మంచంలో పడుకునేవాళ్ళం.పెద్దతనపు నస, అత్తగారి సాధింపులూ వేధింపులూ బామ్మ దగ్గర లేవు. ఎవరేనా "ఈ ముసలమ్మకి భయమూ భక్తీ రెండూ లేవు..." అంటే - "దయకంటే పుణ్యంలేదు. నిర్దయకంటే పాపం లేదు. చెట్టుకి చెంబెడు నీళ్లు పోయడం, పక్షికి గుప్పెడు గింజలు చల్లడం, పశువుకి నాలుగు పరకలు వేయడం, ఆకొన్న వాడికి పట్టెడు మెతుకులు పెట్టడం - నాకు తెలిసిందివే "అనేది.బామ్మకి పుట్టింటి వాళ్ళిచ్చిన భూమి నాలుగైదెకరాలు ఇంకో ఊళ్ళో ఉండేది. మా ఊరికి పది కోసుల దూరం. ఏటా పంటల కాలంలో కౌలు చెల్లించటానికి రైతులు వచ్చేవాళ్ళు . వచ్చీ రాగానే వాళ్ళని ఆప్యాయంగా పలకరించేది. పుట్టిన ఊరు విశేషాలన్నీ గుక్క తిప్పుకోకుండా అడిగేది. వాళ్ళు బదులుచెప్పకుండానే మళ్ళీ ప్రశ్న - ప్రశ్న మీద ప్రశ్న వర్షం కురిపించేది. రైతులేమొ పంట తెగుళ్ళగురించి, అకాల వర్షాల గురించి సాకులు చెప్పి పావలో బేడో చేతిలో పెట్టి వెళ్ళాలనే ఆలోచనతో దిగులు మొహాలు తగిలించుకు వచ్చే వాళ్ళు. ఆ మాట ఎత్తడానికి బామ్మ అవకాశం యిస్తేనా ?"ఎండన పడి వచ్చారు, కాళ్ళు కడుక్కోండరా" అనేసి వడ్డన ఏర్పాట్లలో పడిపోయేది. విస్తరి వేసిందగ్గర్నించి పెరుగు అన్నంలోకి వచ్చేదాకా వాళ్ళతో ఊరివాళ్ళ కబుర్లన్నీ వాగించేది.తీరా పెరుగన్నం చివర్లో "ఏరా అబ్బీ, యీ ఏడాది పంటలెలా వున్నాయిరా " అని అడిగేది.వాళ్ళకి పచ్చి వెలక్కాయ గొంతున పడ్డట్టయేది. కమ్మటి భోజనం కొసరి కొసరి వడ్డిస్తే తిని, పైగా తిన్న విస్తరి ముందు కూచుని "పంటలు పోయాయి" అని చెప్పడానికి నోరాడక "ఫర్వాదేదమ్మా దేవుడి దయవల్ల" అనేవాళ్ళు. ఇంకేం చేస్తారు పాపం అణా పైసలతో శిస్తు అప్పగించి వెళ్ళేవాళ్లు. వెళ్లేప్పుడు "ఇదిగో బుల్లి పంతులూ! మీ అవ్వ గట్టి పిండమే !" అని ఎగతాళి చేసి వెళ్ళే వాళ్ళు.బడికి వెళ్ళనని మారాం చేసినపుడల్లా బామ్మ నాకు అండగా వుండేది. "పసి వెధవ, గ్రాహ్యం వస్తే వాడే వెళ్తాడు- అయినా ఒక్కగానొక్కడు బతకలేక పోతాడా..." అంటూ నన్ను చంకన వేసుకు బయటకు నడిచేది.మా ఇంటి పెరడు దాటగానే పెద్ద బాదం చెట్టు వుండేది. అది మా స్థావరం. రోజులో మూడొంతులు అక్కడే మా కాలక్షేపం. బాదంచెట్టు పచ్చటి గొడుగు పాతేసినట్టు వుండేది. రాలిన పండు ఆకులు విస్తరి కుట్టుకుని బామ్మ భోజనం చేసేది. దాని చుట్టూ చిన్న మట్టిఅరుగు వుండేది. "దీన్ని కాపరానికొచ్చేప్పుడు మా పుట్టించినించి తెచ్చా... అప్పుడు జానాబెత్తెడుండేది... నువ్ నమ్మవ్... పిచ్చి ముండకి మూడే ఆకులు బుల్లి బుల్లివి వుండేవి..." రోజు ఒకసారైనా ఈ మాట నాకు చెప్పేది. నే కాపరానికొచ్చి ఎన్నేళ్ళో ఈ పిచ్చి మొద్దుకి అన్నేళ్లు అంటూ మానుని చేత్తో తట్టేది ఆపేక్షగా.ఇప్పటికీ బామ్మ చెంబెడు నీళ్ళు దానికి పోస్తూనే వుంటుంది. మానుకి రెండు తొర్రలుండేవి. పై తొర్రలో రెండు రామచిలకలు కిలకిలలాడుతూ కాపరం చేస్తుండేవి. ఇంకో తొర్రలో బామ్మ నాకోసం చిరుతిళ్ళు దాచేది. కొమ్మకి తాళ్ల ఉయ్యాల వుండేది. నీడన ఆవుదూడ కట్టేసి వుండేది. దానికి బామ్మ పచ్చి పరకలు వేస్తూ వుండేది. కాకులు పడేసిన బాదంకాయలు వైనంగా కొట్టి నాచేత బాదం పప్పులు తినిపించేది. - ఆ బాదం చెట్టు మా ఇద్దరికీ తోడూ నీడా - ఊరు లేచేసరికి వాకిలంతా తీర్చిదిద్ది ముగ్గులు పెట్టేది బామ్మ. రాత్రి నాకు జోలపాడుతూ రేపటి ముగ్గు మనసులో వేసుకునేది. ముగ్గులు అయ్యేదాకా నేను బామ్మ వీపు మీద బల్లిలా కరుచుకు పడుకుని కునుకు తీస్తుండేవాణ్ణి. "అసలే నడుం వంగిపోయె... పైగా ఆ మూట కూడా దేనికి" - అని మా అమ్మ అంటే "వాడు బరువేంటే. వాడు వీపున లేపోతే ముగ్గు పడదే తల్లీ - చూపు ఆనదే అమ్మా" అనేది బామ్మ.సమస్త దేవుళ్ళకీ మేలుకొలుపులు పాడుతూ వాకిలి నాలుగు దిక్కుల్నీ ముగ్గుతో కలిపేది. అప్పుడు మా మండువా లోగిలి నిండుగా పమిటకప్పుకు నిలబడ్డ పెద్ద ముత్తయిదువులా వుండేది. "పాటలు పాడి దేవుళ్ళని లేపకపోతే వాళ్లు లేవరా" అని అడిగితే "పిచ్చి సన్నాసీ దేవుళ్ళు నిద్దరోతారా! దేవుడు నిద్దరోతే యింకేమైనా వుందీ-! మేలుకొలుపులూ మనకోసమే చక్రపొంగలీ మనకోసమే" అనేది బామ్మ.తెల్లారగానే నూనె రాసి, నలుగు పెట్టి కాకరపందిరికింద ముక్కాలిపీట మీద కూచోపెట్టి వేడినీళ్ళు పోసేది. "చిక్కిపోయాడమ్మా పిల్లాడు... పొడుగు సాగుతున్నాడో ఏమో" అని బామ్మ రోజు నలుగు పెడుతూ దిగులుపడేది. ఒంటి మీద చిన్న గాటో, దెబ్బో, పొక్కో కనిపిస్తే "అఘాయిత్యం వెధవ్వి ఎక్కడ తగిలించుకున్నావ్" అని గారాబంగా కేకలేసి తెగ దిగులుపడిపోయేది. నాకప్పుడు ఎంతో హాయిగా అనిపించేది.నెలకోసారి భజంత్రీవాడు వచ్చేవాడు బాదం చెట్టుకింద నేను మా బామ్మ తలపని చేయించుకునేవాళ్ళం. ముందు నావంతు."ఒరేవ్ జాగ్రత్తగా చెయ్ - పిల్లాడి క్రాపు తెల్లదొర క్రాపింగ్ లా వుండాలి" అని హెచ్చరికలూ, సలహాలూ యిస్తూ ఎదురుగా కూర్చునేది బామ్మ. అయినా వాడి పద్ధతిలో వాడు తిరపతి మెట్లతో డిప్ప కొట్టుడు కొట్టేసేవాడు. తనవంతు వచ్చినపుడు చేతిన వున్న బంగారుమురుగుతీసి నా చేతికి తొడిగేది. స్నానం చేశాక కుంకుడురసంతో ఆ బంగారు మరుగుకి మెరుగు తెప్పించి తన చేతికి వేసుకునేది. మెరుస్తున్న చేతిని తృప్తిగా చూసుకునేది.బజారు చిరుతిళ్లు తినకూడదని నా మీద గట్టి ఆంక్ష వుండేది. ఆరోగ్యం కంటె కుటుంబమర్యాద దెబ్బ తింటుందని- నాకవేం తెలిసేవి కావు. బెల్లపు జీళ్లు, పీచుమిఠాయి, జంతికలు, తేగలూ కొనుక్కు తినాలని నాలిక పీకేది. బామ్మని అడిగితే "ఓస్ అంతేకదాపద" అనేసి కోరినన్ని కొనిపెట్టేది. మరికొన్ని బాదంచెట్టు భోషాణంలో దాచిపెట్టేది.బామ్మ నా పాలిట వరాలిచ్చే దేవత!మనవడికి అడ్డమైన గడ్డీ కొనిపెడ్తోందని తెలిసిబామ్మకి డబ్బు దొరక్కుండా ఇంట్లో కట్టడి చేశారు దీని మీద ఇంట్లో చాలాసార్లు గొడవలు జరిగాయి.బామ్మ మీద నిఘా వేసినా నా చిరుతిళ్ళకి లోటు రాకుండా చూస్తోంది. బియ్యం ఒళ్లో పోసుకొచ్చి జీళ్లు తేగలూ నైవేద్యం పెట్టేది నాకు. అదీ తెలిసిపోయింది. బియ్యం డబ్బాకి తాళం పడింది. దాంతో నా నోటికి కూడా, అత్తగారి ఆటకట్టిందని అమ్మ సంతోషించింది." ఇంటి దీపానివి, చక్రవర్తివి , నీకీ కరువేంటి నాయనా" అని బామ్మ బాధపడింది.ఆరోజు పీచుమిరాయివాడు ఊళ్లోకి వచ్చాడు. వాడు రోజు రాడు. సంతరోజు మాత్రమే వస్తాడు. మూడువైపులా రేకు, ఓవైపు సరుకు కనిపించేలా అద్దం వున్న డబ్బా -విచ్చిన గులాబీలు కుక్కినట్టు డబ్బా నిండా పీచుమిఠాయి పొత్తులు - వాడు డబ్బా చప్పుడు చేస్తూ "పిచ్మిరా" అని చిత్రంగా అరుస్తూ వీధిన వెళ్తుంటే నా నోరెంత వూరిందో బళ్లో వున్న నాకు తెలుసు- ఇంట్లో వున్న మా బామ్మకి తెలుసు. "పిచ్మిరా" అరుపు దూరం అవుతున్న కొద్దీ నాలో బెంగ ఎక్కువవుతోంది. ఆక్షణంలో బామ్మ బడిగుమ్మంలో ప్రత్యక్షమైంది.పంతులుగారు ప్రభవ విభవలు చెప్పిస్తున్నారు. బామ్మ రాకతో ప్రమోదూత దగ్గర రక్కున వల్లింపు ఆగి తరగతి నిశ్శబ్దం అయింది. నరసింహం పంతులుగారంటే గండభేరుండం! పిల్లలూ పెద్దలూ హడిలి చచ్చేవారు. ఆయనకి బుర్రమీసాలు, కళ్లద్దాలు, గుండూ పిలక, చేతిలో బెత్తం, నాలుగువైపులా చూడగల మిడిగుడ్లూ వుండేవి. మా బామ్మ బడిగుమ్మంలోకి వస్తూనే "ఒరే నరసింహా, నా మనవణ్ణి పంపరా" అంది. ఆయన నా వైపు చూసి పోరా అనే లోగానే పలకా పుస్తకంతో నిలబడి వున్నాను. "పో..." అనడమేమిటి తొర్రలో రామచిలకలా తుర్రున దాటుకున్నాను.అవతల వీధి చివర పీచ్మిఠ వాడు నా కోసమే నిలబడి వున్నాడు. అప్పటికే వాడితో బేరసారాలు పూర్తిచేసింది బామ్మ. రెండు మిఠాయి పొత్తులూ, నాలుగు పుంజీల జీళ్లు ఇప్పించింది. జీళ్లు జేబులో పోసుకుని, బామ్మ కొంగుచాటు చేసుకుని మిఠాయిలు రెండూ మింగేశాను. ఆ రంగుకి నోరు ఎర్రగా హనుమంతుడి మూతిలా అయిపోయింది."ఈ మొహంతో ఇంటికెళ్తే ఏవన్నా వుందీ.." అంటూ కాసేపు బజారు పెత్తనం చేయించి, బడిగంట కొట్టాక బావిదగ్గర మూతి కడిగి, కొంగుతో తుడిచి ఇంట్లో ప్రవేశపెట్టింది.తెల్లారి పొద్దున దేవతార్చనలో వుండే బుల్లి కంచుగంట కనిపించలేదని అమ్మ కంగారుగా వెదికేస్తోంది."ఎక్కడికి పోతుంది... ఎలికముండలు లాక్కెళ్ళి వుంటాయి..." అని బామ్మ పట్టీ పట్టనట్టు సద్దేస్తూ మాట్లాడుతోంది."అయినా ఎలికలు గంటనేం చేసుకుంటాయి బామ్మా" అంటే "పిల్లికి కడతాయ్... వెధవాయ్..." అని అరిచి నా నోరు నొక్కి బయటకులాక్కెళ్ళింది.తొర్రలో దాచుకున్న నాలుగు పుంజీల జీళ్లు రెండ్రోజుల్లో పూర్తయినాయి.మళ్లీ సంతరోజు వచ్చింది. ఇంట్లో పెద్ద గాలిదుమారం లేచింది. నాన్న అరుపుల ముందు బామ్మ ముద్దాయిలా నిలబడి వుంది. వాకిట్లో పీచుమిరాయి వాడు నిలబడి వున్నాడు. క్రితం వారం వాడికి బామ్మ కంచుగంట యిచ్చిందట. ఆ లెబ్బల్లో వాడు మనకి నాలుగు మిరాయిలు, ఆరుపుంజీల జీళ్ళు ఇంకా బాకీ వున్నాట్ట! అవి యిచ్చేసి వెళ్తామని సరాసరి వాడు ఇంటికి వచ్చాడు. అదీ గొడవ. సడీచప్పుడు చెయ్యదనుకున్న గంట గణగణా బామ్మ గుండెల్లో మోగింది."దేవుడి గంటనే పాపభీతి కూడా లేకపోయె..." అంది అమ్మ నిష్ఠూరంగా."అంత పాపభీతి పడాల్సిందేముందీ... అయినా ఘంటలో వుంటాడా దేవుడు.... పసివాళ్ళ బొజ్జలో వుంటాడుగాని..." బామ్మ సాయకారం తీసింది."ఈ మెట్ట వేదాంతాలకేం లెండి... ఇట్లాగే వదిలేస్తే అవ్వా మనవడూ కలిసి ఆ చేతిమురుగు కూడా కరిగించేసుకు తింటారు." అంది అమ్మ , నాన్న కి బోధపడాలని. నాన్న కలిగించుకు మాట్లాడేలోగా బామ్మ, కోపంగా గొణుక్కుంటూ చరచరా వెళ్లి బాదం చెట్టుకింద కూచుంది. నేను వెనకే భయం భయంగా వెళ్ళా... కొంచెం దూరంగా నిలబడ్డా...." నువ్వు కాదుగాని....... నీతో నా చావుకొచ్చిందిరా. ఇన్నేళ్ళోచ్చి ఆహరికి నా బతుకు దొంగ బతుకైపోయింది... ఫో అసలు నా చాయలకి రావద్దు... మీ అమ్మా నాన్నావున్నారుగా... వాళ్ళతోనే వూరేగు... నాది అనుకుంటే దుఃఖం... కాదు అనుకుంటే సుఖం..." అంటూ బామ్మ బావురుమని ఏడ్చింది.కంటి ధార ఎండిన బాదం ఆకులమీద టపటపా రాలాయి. పిడుగులు రాలున్నంత చప్పుడు నా చెవికి... దేవుడు ఏడుస్తుంటే ఎంత భయం వేస్తుంది... దిక్క లేని వాళ్ళకి?ఒక్కసారి బేర్ మని పెద్దగా ఏడ్చాను.బామ్మ తటాలున చేతులు జాపి ఒళ్ళోకి లాక్కుంది. అక్కడే చెట్టుకింద ఎండాకుల మీద బామ్మ ముడుచుకు పడుకుంది. నేను బామ్మ పక్కనే వొదిగి దిగాలుగా కూచున్నా, బామ్మ గుర్రుపెట్టి నిద్రపోయింది. బామ్మ మీద గండుచీమలు పాకుతుంటే వాటిని దులిపేస్తూ -వెన్ను మీద చెయ్యివేసి నా పక్కలో కూచునే బామ్మలా కూచున్నాను. కాకి రాల్చిన రెండు బాదంకాయలు గుండుమీద పడితే బామ్మ ఉలిక్కిపడి లేచింది. నాకు నవ్వొచ్చింది. సంగతి అర్ధంకాగానే బామ్మ కూడా...
NOW PLAYING
శ్రీరమణ గారు - బంగారు మురుగు
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.