EPISODE · Feb 13, 2023 · 23 MIN
వంశీ గారి 'సొట్ట ఆదిగాడు' - 'మా దిగువ గోదారి కథలు' నుంచి
from Harshaneeyam
'సొట్ట ఆదిగాడు' అనే ఈ కథ, వంశీ గారి "మా దిగువ గోదారి కథలు' అనే కధాసంపుటి నించి.పుస్తకం కొనడానికి - https://www.telugubooks.in/products/vamsi-ma-diguva-godari-kathalu?_pos=4&_sid=1941d5909&_ss=r (ఈ లింక్ ని ఉపయోగించండి.)'సొట్ట ఆదిగాడు':ఆ వూళ్ళో వున్న అరవై ఎకరాల తోటలూ, వూరికి ఎదురుగా వున్న గోదావరి మధ్యలో వున్న వంద ఎకరాల లంకలు రావి కంపాడు రాజులవి.ఆ రాజుల తాలూకు గుమాస్తాలే వూళ్ళో వుండి కూలోళ్ళనీ పాలేళ్ళనీ పెట్టి పంటలు పండిస్తున్నారు. అదీ ఈనాటి నించి కాదు ఏనాటి నించో.అయితే, దొంగలుగానీ, దోచుకుపోయేవాళ్ళుగానీ ఆ ప్రాంతాలకి రాకండా కూలోళ్ళు పాలేళ్ళూ ఉద్దారకుడూ పగటిపూట కాపలాగాస్తే రాత్రిపూట గంగాలమ్మ తల్లి కాపలా కాస్తుంది.గంగాలమ్మంటే మామూలు మనిషి కాదు. గ్రామదేవత. మహాశక్తి, ఆది శక్తి. ఆవిడకి విగ్రహం లేదు. తోటలో ఒక పంపర పనాస చెట్టు మొదట్లో బొట్టెట్టి గుగ్గిలం పొగేసి అగరొత్తులు వెలిగించి నైవేద్యాలు పెట్టుకుని దణ్ణాలు పెట్టుకుంటారు.ఆమధ్య మాదిగ పేటలో కాళిదాసు సూరన్నగాడు తోటలో కాసే కాబూలు దానిమ్మకాయలు కోసుకెళ్లామని రాత్రిపూట వస్తే తెల్లారేసరికి ఆవిడ పాదాల దగ్గర (పంపరపనస చెట్టు మొదట్లో) రక్తం కక్కుకు చచ్చిపడున్నాడు.ఇంకోసారి లంకలో పొగాకు మోపులు పట్టుకెళ్లామని నావఁ వేసుకెళ్తే, తెల్లవారేసరికి వాళ్ల తలకాయలు పొగాకు తోటలోనూ, మొండాలు ఎక్కడో వున్న మూలస్థానం అగ్రహారం రేవులోనూ తేలాయి.పరిశోధనంటా దిగిన పోలీసులకి చంపినోళ్ళెవరన్నదిఎన్నాళ్ళకి తేలలేదు.అయినా సరే డిటెక్షను చేస్తున్న పోలీసుల్ని చూసి, నవ్వుకున్న గోపిలంక జనం, “వెర్రిగాకపోతే ...అమ్మోరు. వీళ్ళకి దొరుకుద్దా?” అనుకున్నారు.అమ్మోరు గంగాలమ్మ తల్లంటే రావికంపాడు రాజులకి చాలా నమ్మకం, చాలా భయం భక్తీనీ,ఆ తల్లిని నమ్మేవాళ్ళు ముక్కనుమ రోజున కోడిపుంజుల్నీ బోల్డన్ని మేకపోతుల్ని గొర్రెపోతుల్ని బలేస్తారు. ఆ రోజంతా ఆవిడ ముందు రక్తం గట్టు తెగిన ఏరులా పారుతూ వుంటుంది. నెర్రలు తీసిన నల్లరేగడి నేలలో ఇంకుతా వుంటుంది. అమ్మవారికి తుని నించి కొమ్ము బూరా వాళ్లని, పెద్దాపురం నించి డప్పులవాళ్లని పిలిపించి మా గొప్పగా చేయిస్తారు సంబరం. చిత్రమేంటంటే ఎప్పుడూ గుమాస్తాలకి వదిలేసే ఆ రాజులో ఒకరు మాత్రం ఆ సంబరం రోజు వచ్చి తీరతారు. అది ఆనవాయితీ..ఎడం కాలు మడం దగ్గర తోడెయ్యడంతో వేళ్ళని మాత్రం భూమ్మీద ఆన్చి నడిచే గుత్తాల ఆదియ్యని సొట్టాదిగాడంటారంతా. చాలా కష్టపడి పనిచేసే ఆ సొట్టాదిగాడి నోరు మంచిది కాదంటారు.అలాంటి సొట్టాదిగాడు రావికంపాడు రాజుల కమతంలో జేరాడు.ప్రతి ఏడు వారి వంశంలో ఎవరో ఒకరొచ్చేవారు. అలాంటిది ఆ ఏడు ముక్కనుమ రోజు ఆ రావి కంపాడు రాజులు ముగ్గురొస్తున్నారు.గోపిలంక గంగాలమ్మ వారి సంబరం చరిత్రలోనే, ఇదో గొప్ప వింతని గుమస్తాలంతా తెగ కంగారు పడిపోతా, సంబరం చాలా పెద్ద ఎత్తున జరిపించే పనుల్లో వున్నారు.రకరకాల బెత్తాయింపులు, రకరకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి.తూర్పు నుండే తోటల మధ్య పడమట వేపుండే గోదావరితల్లి కనపడేలా కొబ్బరితోటల మధ్యలో అచ్చం రాజులకోటలా కట్టిన గెస్టహౌస్లోకి దిగిన రాజులు, పాలేళ్ళందరికి తలకో జత బట్టలూ నూట పదహారు! చొప్పున డబ్బులు ఇమ్మని గుమస్తాలకి ఆర్డర్లేశారు.ఎక్కడ దొరికిందో మూడు ముంతల సందకల్లు దొరికింది సొట్టాదిగాడికి. దాన్ని లాగిస్తుండగా రాజులు తోటలోకి దిగారన్న సంగతి తెల్సింది. నిషా బాగా ఎక్కేసిన ఆదిగాడికి రాజులో మాటాడాలనిపించిందిసొట్టాది గాడు అనుకుంటున్నట్లు అక్కడెవరికైనా తెలిస్తే కాళ్ళకి పలుపుతాడు మెలేసి పక్కకి లాగేసే వారు. కానీ, ఎవరి పనుల్లో వాళ్లుండటంతో ఈడ్ని పట్టించుకోలేదు.గెస్ట్ హౌస్ బాల్కనీలో కూర్చున్న రావికంపాడు రాజులకి ఈ తోటల్లో మా గొప్పగా దర్శనమిచ్చే ఆ గోదావరి తల్లి, ఈ వాతావరణం ఇంత గొప్పగా వుంటుందని ఇప్పుడే తెలిసొచ్చింది. వాళ్లు కళ్ళు మూసుకుని గంగమ్మ తల్లికి దణ్ణమెట్టుకుని ఇక నించి ప్రతి ఏడూ వస్తామని మొక్కుకున్నాకా స్కాచ్ పోసిన గ్లాసులందుకున్నారు.ఇంతలో దిగిపోయిన సొట్టాదిగాడు, “మా రాజులకి నమస్కారవండి," అన్నాడు. మందు పుచ్చుకుంటా ఎవర్నువ్వన్నట్టు చూశారు.“నన్ను సొట్టాదిగాడంటారు బాబూ..." అంటా ఆ రాజుగారి నోట్లో వున్న దాన్ని చూసి, "తవరి నోట్లో అదేంటండి తెల్లగా అంత పొడుగ్గా వుంది," అన్నాడు.నవ్వేసిన రంగరాజు, "ఇదా? దీన్ని కింగ్ సిగరెట్ అంటార్లే... సిగరెట్ కోసమొచ్చావా?" అనందిస్తుంటే సిగ్గుపడతా తలొంచుకుని, “వద్దండి బాబూ నా దగ్గర గుర్రంబీడి వుందండి." అన్నాడాదిగాడు."అయితే సరే," అనుకుంటా సిగరెట్లు వెలిగించి స్కాచ్ తాగుతున్నారు.వాళ్ళ ముందు చతికిలబడిపోయిన సొట్టాదిగాడు, “ఎంత కింగయినా గుర్రం లేకపోతే వేస్ట్ కదండీ,” అనడంతో గతుక్కుమన్న రంగరాజు, "ఈడికి బాగా ఎక్కేసినట్టుంది.” అన్నాడు."స్కాచ్ పక్కన నీచు కాదండి... కొంకిడికాయ రసం కలిపిన సందకల్లు తాగండి. అసలు కిక్కేంటో తెలుస్తది." అన్నాడు సొట్టాదిగాడు.మూడో రౌండు పోసుకుంటున్న పర్వతాలరాజుగారు, “ఏరా.... పండగపూట ఒంటిమీద బట్టలు చేతిలో డబ్బులూ పడేసరికి మాట తేడా వచ్చేసింది,” అన్నారు.నవ్వేసిన సొట్టాది, "మావి మాటలే బాబూ... సేతలు మాత్రం మీవి.." అంటా లేచి, “ఏవండి... జత బట్టలు జీవితమంతా సరిపోతాయా... నూట పదార్లుతో నేను సచ్చిదాకా కల్లు తాగల్నా" అనడంతో చిరాకు పడతా లేచిన పర్వతాలరాజు, “మరి మీలాంటి కూలి నాకొడుకులకి మా భూములు బంగ్లాలూ రాసెయ్య మంటావా?" అన్నాడు."నిజంగా కూలోడు మీ కొడుకైతే తెలుస్తదండీ కష్టమేంటో."సొట్టాదిగాడి నడ్డి మీద తన్నడానికి లేచిన రంగరాజుని కూర్చోబెట్టారు బంగార్రాజుగారు. అయినా కోపం ఆగని రంగరాజు, “ఏంట్రా నోరు లెగుస్తుంది," అన్నాడు.“కూలోడు గోదారితల్లిలాంటోడండి... ఆడెప్పుడు గోపాదాలరేవులో గోదారమ్మలాగ మెదలకండానే వుంటాడండి... సిరాకేస్తేనే ఇదిగో ఇప్పుడు నాలాగ రెచ్చిపోతాడండి," అన్నాడు సొట్టాదిగాడు."అసలు వీడ్నిక్కడికెవడు రానిచ్చేడు," అంటా చిరాగ్గా లేచి ఆదిగాడ్ని తన్నడానికెళ్ళబోతున్న రంగరాజుని వెనక్కి లాగిన బంగార్రాజు, "ఈ ఈవినింగు మనకో ఎంటరటైనుమెంటీడు. సీరియస్సవ్వకండా కూర్చో జెబుతాను," అని కూర్చోబెట్టి సొట్టాదిగాడి కేసి చూసి, “ఏరా కుంటోడా... నీ కంత అన్యాయమేం జేసేంరా." అన్నాడు.“దార్లో కొచ్చేరు," అంటా నవ్వేసి, "కల్లు రేటు పెరిగింది... కూలి రేటు పెంచలేదు... రోజంతా రెక్కలు ముక్కలు జేసుకునేదెందుకండీ, పొద్దోతే గొంతులో పడే ఆ కల్లుకోసమో సారాకోసమో గదా... ఏవండి గట్టు మీద కూర్చుని చూసే వాడికేం తెలుసండీ కమతంలో కష్టం ఏంటో? ఊరికే ఇచ్చినట్టు అంత ఇదైపోతారేంటండీ. ఇక్కడ జేసే ప్రతి పన్లోనూ మా కల్లూ సారా వున్నాయండీ... అదే... మీ సేవలకి రక్తం మొత్తం కరిగిపోయి ఒంట్లో మొత్తం ఇప్పుడున్నది కల్లే కదండీ... సంటి పిల్లోడి చేతిలో తాయిలం పెట్టినట్టు ఏడాదికోసారి కంటి తుడుపుగా మీరేదో ఇస్తే మా రాజులుంగారిచ్చేరంటా ఏడాది పొడుక్కి పని చేస్తారండి మా బుర్ర తక్కువ ఎదవలు... అందుకే నేనొకటినిర్ణయించుకున్నానండీ."“ఏంట్రా?"“మూడునెల్లకో జత బట్టలూ, పది తాళ్ళున్న అయిదెకరాల పొలం నా పేర్న రాస్తేనే రోజూ పన్లో కొచ్చేస్తానండి."మేనేజరు నారాయణమూర్తిని పిల్చిన పర్వతాలరాజుగారు, "వీడ్ని అర్జంటుగా బయటికి తొయ్యండి," అన్నాడు."ఆ లాగేవోడికన్నా డబ్బులు కరక్టుగా ఇవ్వండి బాబూ... లేకపోతే ఏదో రోజూ కోపంతో మిమ్మల్ని నేను గోదాట్లోకి లాగెయ్యగలను," అంటున్న ఆదిగాడి అంతా బయటికి లాక్కెళిపోయారు..సొట్టాదిగాడి దెబ్బకి రాజులు ముగ్గురూ తాగిన స్కాచ్ మొత్తం దిగిపోయేసరికి కొత్తబాటిలో పెన్ చేశారు.చిన్నప్పుడే మేనకోడలు వీరలక్ష్మితో పెళ్ళయిపోయిన సొట్టాదిగాడికి ఇద్దరు కవలపిల్లలు. అదీ ఆడ పిల్లలు. ఆ ఇద్దరు పిల్లలంటే పంచప్రాణాలు. వాళ్ళు కడుపునిండా తింటుంటే చూడ్డం చాలా యిష్టం వాడికి పొద్దుట రేవులోకెళ్ళి శివాలక్ష్మి హొటేలో ఇడ్డెన్లు తెచ్చి పెడతాడు. సాయంత్రమైతే మళ్ళీ రేవులో చినబ్బు కాఫీ హోటేల్లో పెసర పొణుకులు తెచ్చి తినిపిస్తాడు. ఆ పిల్లలూ వీరలక్ష్మి తిన్నాకా మిగిలింది మట్టుకే తింటాడు సాట్టాదిగాడు."పగలంతా పని చేసాచ్చే నువ్వు ఇదేంటిలా పస్తు?" అని వీరలక్ష్మడిగితే నవ్వేసెళ్ళిపోతాడు ఏటిగట్టు వేపు. అలా వెళ్తా వెళ్తా తల్లి గోదారి గాలిని పీలుస్తా తన బిడ్డల్నే తల్చుకుంటా ఆనందపడతాడు.అలా అందర్నీ తిడతా వుంటే ఆ ఏరియాలో ఎవడూ పనిలో పెట్టుకోడం లేదాడిని. దాంతో పెళ్ళాం పిల్లల కోసం గోదావరి గట్టుమీద చాలా మైళ్ళు నడిచి కోటిపల్లి అవతలున్న కూళ్ళ ఇసక రేంపులో జేరాడు.ఎండిపోయిన గోదావరిలో ఇసకని ప్రొక్లైనర్ల తో తీసి లారీలో వేస్తున్నారు. అక్కడొకటీ అక్కడొకటి ఆఫీసు పాకలు. అందులో వున్న గుమస్తాలు లారీల ట్రిప్పులు రాసుకుంటున్నారు. ఎక్కడికక్కడ మేనేజరూ సూపర్‌వైజర్లు కల తిరుగుతున్నారు. వాళ్ళ పని ఈ నాలుగు నెలలే. తర్వాత వర్షాకాలమొచ్చేస్తుంది. వరదలో గోదావరి ములిగిపోతుంది. కోట్ల మీద పాట పాడిన కాంట్రాక్టరు ఈలోపే తన పెట్టుబడి లాభాల్తో సహా వెనక్కి లాక్కోవాలి. దాంతో ఎవరికీ నిద్రలుండటం లేదు. రాత్రీ పగలనక పనిచేస్తున్నారు. ఏటిగట్టు మీంచి లోపల గోదావరి దాకా ఒక కిలోమీటరు పొడుగున ఇసక, కొబ్బరాకులు వేసి దానిమీద మళ్ళీ ఇసక వేసి తడుపు తున్నారు. జనంలో ఎక్కువమంది వూరికి దూరంగా వున్న లాకు పేటలో వాళ్ళే. వాళ్లలో కలిసిపోయిన సొట్టాది గాడు సీవెండి బిందెలో నీళ్ళు తెచ్చి తడిపే పని చేస్తున్నాడు.రేంపుని ఆ ఏడు వేలం పాట పాడుకున్న సలాది సూర్రావు మంచి భోజనప్రియుడు. రేంపులోనే కుదుమట్టంగా వంట పాకనేయించి వారానికో రకం కూరలూ, పులుసులూ, వేపుళ్లూ వండించడం మొదలెట్టాడు. సాయంత్రమైతే మసాలా గారో, ఉల్లిపాయ పకోడిలో వేయిస్తున్నాడు. ఆ కూలోళ్ళ మధ్యలో తనూ వాళ్ళలో ఒకడిగా కల్సిపోయి చిల్లో బొల్లో మంటా మాటాడుంటే చూసిన జనం, ఈరికి పెద్దా చిన్నా లేదం'టాని సంబరపడిపోతున్నారు. వాళ్ళు చేస్తున్న బండ చాకిరీ మర్చిపోతున్నారు. అందరి కంటే ఎక్కువ ఆ పని చేస్తా చూస్తున్న సొట్టాది గాడు కొన్ని రోజులు చూశాడు.అది కల్లు సీజను కాదు. దాంతో పుల్లు నాటుసారా పట్టించేసి సూర్రావు దగ్గర కెళ్లేసరికి కూలోళ్లతో పంక్తి కూర్చుని భోజనం చేస్తూ కనిపించాడు సూర్రావు, నమస్కారం పెట్టి కూర్చున్న సాట్టాదిగాడికి ఆకేసేరుదాన్ని ఇసకలోకి విసిరేస్తున్న ఆదిగాడ్ని చిత్రంగా చూస్తున్నారు. "ఏరా ఏమైంది?" అన్నాడు సూర్రావుగారు. "గుండెల్లో మంటగా వుందండి." అన్నాడు.“రాంపురంలో స్టాలిన్ డాక్టర్ గారి దగ్గరకి తీసుకెళ్ళి ఏదన్నా మందేయించనా?" అన్నాడు సూర్రావు.“నేనే వేసుకున్నానండీ. గాబట్టే ఆ మంట బయటికొచ్చిందండి... ఏవండీ... సవ్వాదిగా వుండే పెసర పొణుకులూ మసాళాగార్లూ మీకిష్టమైతే మేవెందుకు తినాలండి... సీక్రేటు చెప్పనాండీ . మీరు తినగా మిగిల్సి మాకెడతన్నారండి... మా పిచ్చి యెదవలు ఇదంతా మామీద మీకిష్టవనుకుంటున్నారండి." అనాగేడు అదిగాడు.ఏం చదువుకోపోయినా వ్యాపార లక్షణాలు తెల్సిన సలాది సూర్రాపుగారికి ఎక్కడ పెంచాలో ఎక్కడ తుంచాలో బాగా తెల్సు. దాంతో నవ్వుతా, "చూడొరే కుంటోడా ఇవన్నీ మీకోసమే చేయిస్తున్నాను." అన్నాడు..నవ్వేసిన సొట్టాదిగాడు, “ఆకలితో ఉంటార్రే, ఆకులో ఏది పడేస్తే అది తింటార్లే అనుకుంటున్నారండీ... మాకూ రుచులు తెల్పండీ," అన్నాడు."ఒరేయ్... వోనర్నన్న విషయం కూడా మర్చిపోయి మీ అందర్లో కల్సిపోయి పని చేస్తున్నాన్రా... మిమ్మల్ని నా పిల్లల్లాగ చూసుకుంటన్నాన్రా. అలాంటి నా గురించి ఏంట్రా నోటికొచ్చినట్టు మాటాడతన్నావ్?""మీ పిల్లల్లాగ జూసుకుంటన్నావా? అయితే మీ పిల్లల్ని గూడా రేపట్నుంచీ మా పన్లోకి పంపండి. లేదా మమ్మల్ని మీ పిల్లల్తో పాటు స్కూళ్ళకి పంపండి."ఆవేశంతో రెచ్చిపోయిన సూర్రావు వూగిపోతా. “ఒరేయ్," అనరిచాడు."ఓనర్... ఓనర్లాగుంటే మాటాడలేకపోయేవాడ్నేమో... మీరు ఓ కూలోడిలా మాతో బాటు తిరుగుతా మధ్యలో...
NOW PLAYING
వంశీ గారి 'సొట్ట ఆదిగాడు' - 'మా దిగువ గోదారి కథలు' నుంచి
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.