EPISODE · Jul 23, 2019 · 42 MIN
మిథునం "శ్రీరమణ గారి కధ
from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy
💐💐కధాభిమానులకు నమస్కారం. ఈ వారం మనం వినబోయే కధ "మిథునం " రచయిత శ్రీరమణ గారు. శ్రీరమణ గారి మిథునం కథ వాస్తవానికి పరిచయం అవసరం లేని కథ. 1997 లో ఆంధ్రభూమి వార పత్రికలో తొలిసారి అచ్చు అయిన నాటినుండి ఈనాటిదాక ఈ కథ ఎన్ని కథాసంకలనాలలో చోటు చేసుకుందో , చెప్పడం కష్టం. మిథునం కథకి అనేక విశిష్ట గౌరవాలు , గుర్తింపులూ లభించాయి. అన్నిటికన్నా గొప్ప గౌరవం , ప్రఖ్యాత చిత్రకారుడు , దర్శకుడు కీ. శే. బాపు గారు ఈ కథను వారి స్వహస్తాలతో తిరగరాయడం.కథలోని వృద్ధ దంపతుల్ని అర్థనారీశ్వరుల్లాగా చిత్రించడం , బాపు గారి చేతి రాతలో , ముఖచిత్రంతో ఆ కథను , రచన శాయి గారు తమ పత్రికలో పునర్ముద్రించడమే కాకుండా , ఆ ఒక్క కధనూ పుస్తక రూపంలో బాపుగారి దస్తూరి తిలకంతో తీసుకువచ్చారు.ఆ విధంగా మిథునం కథ కొన్ని వేల కాపీలు అచ్చయ్యి , పెళ్లిళ్లు , షష్టిపూర్తి ఫంక్షన్స్ , పదవీ విరమణ సందర్భాల్లో ఇవ్వడానికి ఒక మంచి కానుకగా మారింది.నేను కూడా మా పెద్దమ్మాయి పెళ్లికి వచ్చిన వారికి బహుమతిగా ఇచ్చాను.సుప్రసిద్ధ దర్శకులు ఎమ్ టి వాసుదేవన్ నాయర్ మిథునం కథను మలయాళంలో సినిమాగా తీశారు. ఏషియా ఫిల్మ్ ఫెస్టివల్ లో ఆ సినిమాకు అవార్డు వచ్చింది.రచయిత , నటుడు తనికెళ్ళ భరణి రెండే పాత్రలతో "మిథునం " ని తెలుగు తెరకు ఎక్కించారు.బాలు , లక్ష్మీ ఈ కథలోని అప్పదాసు , బుచ్చిలక్ష్మి పాత్రలను పోషించారు.సినిమాకి మంచి పేరు వచ్చింది. సాధారణంగా రచయిత పేరు ముందు చెప్పి తరువాత రచన పేరు చెప్తాము. ఉదాహరణకి పోతన భాగవతం , శ్రీనాధుడి కాశీఖండం , విశ్వనాథ వేయిపడగలు , శ్రీ శ్రీ మహాప్రస్థానం....ఇలా...కానీ ఈ కథ తర్వాత రచయిత "మిథునం శ్రీరమణ "అయ్యారు.నాకు తెలిసి అంతకుముందు కూడా అయన పేరడీల శ్రీ రమణ గానే పేరు తెచ్చుకున్నారు. మిథునం నక్షత్ర కూటముల్లో ఒక రాశి , దంపతులు ఆ రాశి చిహ్నం.ఈ కథకూడా దాంపత్య జీవిత వైభవానికి ఒక చిహ్నంగా , ప్రతీకగా , పతాకగా నిలుస్తుంది. ఏది ఏమైనా తెలుగు కథా సాహిత్యంలో "మిథునం " కి ముందు , "మిధునానికి తరువాత అని చెప్పవలసిన విధంగా ఈ కథ నిలిచిపోయింది. ఈ కథ చదివి వినిపించాలి అని ఎంతోకాలంగా మనసులో ఉన్నా , కథనంలోని ధోరణిని , పాత్రల చిత్రీకరణలోని నగిషీల్ని శ్రోతలకు అందించలేనేమో అనే జంకుతో ఇన్నాళ్లు ఆగిపోయాను.ఇక ఆగలేకపోయాను.కథలోని విశేష అంశాల్ని గురించి , చెప్పాలి అంటే "వినబోతూ రుచులెందుకు " అని చెప్పాలి.కథలో మొదటినుంచి చివరిదాకా వచ్చే వంటకాల ప్రసక్తి పక్కనుంచితే "ఎవరి రుచి బతుకులు వాళ్ళవి "అన్న రచయిత మాటలు కథలోని తాత్వికతకి పరాకాష్ట.వినండి "మిథునం "శ్రీరమణ గారి కధ💐💐🙏మీ కొప్పర్తి రాంబాబు , ఇండియన్ బాంక్ , విశాఖసాగరతీరం.
Embed this episode
NOW PLAYING
మిథునం "శ్రీరమణ గారి కధ
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.